ఉపాధికి సమీపంలోనే పేదలకు గృహాలు నిర్మిస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

by Batti.Sumithra |

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఉపాధికి సమీపంలోనే పేదలకు గృహాలు నిర్మిస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మూసారాంబాగ్‌లోని అఫ్జల్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 97 మంది లబ్ధిదారులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్, మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలాతో కలిసి ఇంటి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పట్టాలు అందుకుంటున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. మలక్‌పేట్ నియోజకవర్గంలో ఇంకా గృహాలు అవసరమైన అర్హులైన కుటుంబాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో తొలి విడతగా చేపట్టనున్న ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో భాగంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ప్రభుత్వ భూములను గుర్తించి గృహాలను నిర్మిస్తామని తెలిపారు. లబ్ధిదారులు తమ ఉపాధికి దూరం కాకుండా వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు నిర్మించడం ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేద కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భూముల లభ్యతను పరిశీలిస్తూ, ఉపాధి ఉన్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పునరావాస అవసరాలను కూడా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పరిశీలిస్తోందని తెలిపారు. మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సొంతింటి తాళాలు, పట్టాలు అందుకోవడం వారి కుటుంబాలకు కొత్త జీవితానికి నాంది పలికే సందర్భంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్డీవో రామకృష్ణ, ప్రాజెక్టు డైరెక్టర్ (హౌసింగ్) అశోక్ చక్రవర్తి, సైదాబాద్ తహసీల్దార్ మణిపాల్, గృహనిర్మాణ, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story