VinFast: భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ అతి చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

by S Gopi |

పట్టణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ నాలుగు సీట్ల మినీ ఎస్‌యూవీ బాక్సీ డిజైన్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, కాంపాక్ట్ సైజుతో ఆకట్టుకుంటుంది.

VinFast: భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ అతి చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లో తన ఉనికిని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వీఎఫ్6, వీఎఫ్7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విక్రయిస్తున్న కంపెనీ, ఈ ఏడాది చివర్లో తన అతి చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వీఎఫ్3ని భారత్‌లో విడుదల చేయనుంది. పట్టణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ నాలుగు సీట్ల మినీ ఎస్‌యూవీ బాక్సీ డిజైన్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, కాంపాక్ట్ సైజుతో ఆకట్టుకుంటుంది. ఇందులో 18.6 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ, వెనుక భాగంలో అమర్చిన 43 బీహెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్ ఉండగా, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 210 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 3.1 మీటర్ల పొడవు ఉన్న ఈ వాహనం నగరాల్లో రద్దీ రోడ్లపై సులభంగా నడపడానికి అనువుగా రూపొందించారు. ఫీచర్ల పరంగా కూడా వీఎఫ్3ని సింపుల్‌గా, అన్ని రకాలుగా ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. క్యాబిన్‌లో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డీ-కట్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ ఏసీ, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, రెండు స్పీకర్ల ఆడియో సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రత్యేకంగా డ్రైవర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లేకుండా, అవసరమైన సమాచారం అంతా టచ్‌స్క్రీన్‌పైనే చూపించే విధంగా డిజైన్ చేశారు. వెలుపల ఎల్ఈడీ లైట్లు, ఎస్‌యూవీ తరహా బ్లాక్ క్లాడింగ్, 191 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్, 16 అంగుళాల వీల్స్‌తో చిన్న కారైనప్పటికీ ఎస్‌యూవీ లుక్‌ను అందిస్తోంది.

Next Story