పోలీస్ శాఖలో 20 వేల పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలి : ఆనగంటి వెంకటేష్

by Batti.Sumithra |

రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పోలీస్ శాఖలో 20 వేల పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలి : ఆనగంటి వెంకటేష్
X

దిశ, ఇబ్రహీంపట్నం : రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని, అలాగే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికీ నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జిల్లా కమిటీ సమావేశం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే ఇప్పటి వరకు గత ప్రభుత్వ నోటిఫికేషన్లతో కలిపి కేవలం 55 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని పేర్కొన్నారు. ఇంకా 1.45 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

అదేవిధంగా జాబ్ క్యాలెండర్‌ను నామమాత్రంగా ప్రకటించి అమలు చేయడం లేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తూ వారిని మోసం చేస్తోందన్నారు. స్పష్టమైన జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి అమలు చేయాలని, తక్షణమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో 20 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా రాష్ట్ర మాజీ డీజీపీ, ప్రస్తుత డీజీపీలు పలుమార్లు ప్రకటించారని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కేవలం 5 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడంతో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత తీవ్ర ఆందోళనకు గురవుతోందన్నారు.

గత నాలుగు సంవత్సరాలుగా పోలీసు రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగుల తరఫున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి. జగన్, జిల్లా నాయకులు జంగయ్య, శివశంకర్, మహేష్, భాస్కర్, గిరి తదితరులు పాల్గొన్నారు.

Next Story