- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారా నగరం .. జపాన్ పర్యటన - 2
నారా సిటీ జపాన్ లోని అతి ప్రాచీనమైన చారిత్రక నగరం. కాన్సాయ్ ప్రాంతంలో వున్న నారా ప్రిఫెక్చర్ కు రాజధాని.

తర్వాతి రోజు ఉదయమే హోటల్లో ఉపాహారం ముగించి మాకు కేటాయించిన వాహనంలో కూర్చున్నాం. మా ప్రయాణం నారా నగరానికి. గైడ్ ఆకాశ్ హిందీలో ఆ నగర ప్రాముఖ్యతను వివరించాడు. సుమారు 30 40 నిమిషాలలో మేం అక్కడ దిగిపోయాం. ఒసాకా నుంచి నారా నగరం దాదాపు 35 కిలోమీటర్ల దూరం.
నారా సిటీ జపాన్ లోని అతి ప్రాచీనమైన చారిత్రక నగరం. కాన్సాయ్ ప్రాంతంలో వున్న నారా ప్రిఫెక్చర్ కు రాజధాని. నగర విస్తీర్ణం 276.84 చదరపు కిలోమీటర్లు. జనాభా సుమారు 3.5లక్షలు. ఇది జపాన్ కు మొట్టమొదటి రాజధాని. క్రీ.శ.710లో చక్రవర్తి ఎంప్రెస్ గెమ్మీ (Genmei) రాజధానిని ఇక్కడికి మార్చినట్లుగా గైడ్ చెప్పాడు. ఆ రోజుల్లో నారా నగరాన్ని " హేయిజో - క్యో " అని పిలిచేవారు. మహిళా నేతలు పరి పాలించడం వల్ల కాబోలు తర్వాతి కాలంలో " నారా - షి " గా ప్రాచుర్యం పొందింది. ఈ కాలంలోనే జపాన్ లో బౌద్ధ మతం, శిల్పకళ, సాహిత్యం బాగా అభివృద్ధి చెందాయి. దాదాపు 84 సంవత్సరాలు రాజధాని నగరంగా ఉన్నది. 794 లో రాజధాని క్యోటోకు మారిన తర్వాత కూడా నారా నగరం మత, సాంస్కృతిక కేంద్రంగా కొనసాగింది. యునెస్కో 1998 లో " హిస్టారిక్ మాన్యుమెంట్స్ ఆఫ్ ఏన్షియంట్ నారా " అనే పేరుతో నారా నగరంలోని ఎనిమిది ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అందులో ప్రధానమైంది తోడై - జి బుద్ధా టెంపుల్.
మేం అలా నడుస్తూ వెళుతుండగా ఇద్దరు స్థానిక అమ్మాయిలు నన్ను వాళ్ళను ఫోటో తీయమని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళను ఫోటో తీసి మాటలు కొనసాగించాను. తాము హిస్టరీ స్టూడెంట్స్ అని చెప్పి, నేను హైదరాబాద్ నుంచి వచ్చానని తెలుసుకొని, హైదరాబాద్ చారిత్రక నగరమని, తమకు చాలా ఇష్టమని చెపుతూ నారా నగరం చరిత్ర మీకు తెలుసా? అని నన్ను ప్రశ్నించి, ఎంప్రెస్ గెమ్మీ గురించి చెప్పారు. మహిళా చక్రవర్తి అయిన ఆమె వివరాలు ఇక్కడ చెప్పుకోవడం చాలా అవసరం. నేను నారా నగరాన్ని ఉత్సాహంగా చూడాడానికి కూడా ఇదే కారణం. స్థానిక అమ్మాయిలు ( ఆరినో, కాహిని అనేవి వాళ్ళ పేర్లు) ఆమె గురించి చెప్పినప్పుడు విని ఒక మహిళగా గర్వంగా ఫీలయ్యాను. వాళ్ళు ఫీల్డ్ వర్క్ కొరకు అక్కడికి వచ్చారట. నాతో కలిసి ఫోటో తీసుకున్నారు. వాళ్ళ ప్రాజెక్టులో పెట్టుకుంటామని చెప్పారు.
ఎంప్రెస్ గెమ్మీ ( Genmei )జపాన్ చరిత్రలోనే అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన మహిళా చక్రవర్తి. అత్యంత తెలివైన నాయకురాలిగా, దృఢమైన నిర్ణయాలు తీసుకునే పాలకురాలుగా జపాన్ చరిత్రలో నిలిచి పోయింది. మన ఆంధ్రుల చరిత్రలో రాయల కాలాన్ని "స్వర్ణ యుగం" అన్నట్లుగానే జపాన్ చరిత్రలో ఆమె పరిపాలించిన కాలాన్ని "నారా పీరియడ్" అంటారు. అది ఆమె పాలనతోనే మొదలైంది. ఒకరకంగా అది జపాన్ చరిత్రను మలుపుతిప్పిన కాలం.
ఎంప్రెస్ గెమ్మీ అసలు పేరు ప్రిన్సెస్ అబే. టెంజి చక్రవర్తి కూతురు. తన మేనల్లుడైన ప్రిన్స్ కుసకాబనేను పెళ్ళి చేసుకుంది. వీరిద్దరి కుమారుడే జపాన్ చక్రవర్తులలో ఒకరైన మొము ( Monmu ). ఆయన ఆకస్మిక మరణం తర్వాత మనుమడు చాలా చిన్న వాడు కావడం వల్ల, రాజ్యం ఇతర రాజులకు దక్కకుండా కాపాడడం కొరకు తానే స్వయంగా చక్రవర్తిగా 707లో పాలనా బాధ్యతలు చేపట్టింది. ఇది విన్నప్పుడు నాకు మన రాణీ రుద్రమ దేవి గుర్తుకొచ్చింది. అదే విషయం ఆ అమ్మాయిలకు చెప్పాను. అలా సంక్లిష్ట పరిస్థితుల్లో గద్దెనెక్కిన ఆమె 707 - 715 వరకు ఎనిమిది సంవత్సరాలు మాత్రమే పరిపాలిoచింది. పాలించిoది చాలా తక్కువ కాలమే అయినా ఆమె చేసిన సంస్కరణలు, పొందిన విజయాలు అపారమైనవి. ఆమె అధికారంలోకి వస్తూనే తీసుకున్న కీలక నిర్ణయం రాజధానిని ఫుజివారా నుంచి నారా నగరానికి మార్చడం. చైనా టాంగ్ రాజవంశం నమూనాతో ఆమె ఈ నగర రాజధానిని నిర్మించింది. ఆమె చేపట్టిన మరో కీలకమైన నిర్ణయం జపాన్ ఆర్థిక వ్యవస్థనే మార్చివేసింది. అదే దేశంలో తొలిసారిగా వెండి, రాగి నాణాలను ముద్రించడం. వాటిని " వాడో కైచిన్ "( Wadokaichin ) అంటారు. తరతరాల చరిత్ర, సంస్కృతిని భవిష్యత్తరాల కొరకు భద్రపరచ డానికి విస్తృతమైన గ్రంథరచనకు పూనుకోవడం. దాని ఫలితమే జపాన్ చరిత్రలో మిక్కిలి పురాతనమైన " కోజికి " గ్రంథం 712లో ఆమె కాలంలోనే పూర్తయింది.
వయోభారం కారణంగా తన అధికారాన్ని మనవడికి కాకుండా కూతురు ఎంప్రెస్ గెన్షో (Gensho)కు ఇవ్వడం గమనించదగ్గది. జపాన్ చరిత్రలోనే ఇది మొదటిది చివరిది కూడా.. ఇద్దరు మహిళలు జపాన్ భవిష్యత్తును తీర్చిదిద్దారు. కనుకనే ప్రస్తుతం ఆ దేశం అన్ని రంగాలలో అంత అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. ఆ తర్వాత ఆమె రాజ్యాంగ సలహాదారుగా పని చేసింది. చివరి దశలో బౌద్ధ సన్యాసినిగా మారింది. జపాన్ పాలకులలో బౌద్ధ దీక్ష తీసుకున్న మొదటి వ్యక్తి కూడా ఆమెనే కావడం విశేషం." ప్రజలకు ఆజ్ఞలు ఇవ్వడమే కాదు, ఆచరించి చూపించింది." అనడానికి ఇది చారిత్రక నిదర్శనం. చెప్పింది చేసి చూపించడం మహిళల తత్వం కూడా.. నారా నగరంలోనే వున్న ఆ మహా సామ్రాజ్ఞి సమాధిని సమయాభావం వల్ల దర్శించలేక పోయాను.
అలా ఆ పిల్లలతో మాట్లాడుతూ, మహిళాశక్తిని మనసులో ఆవాహన చేసుకుంటూ, మధ్య మధ్యలో సకురా పూల అందాన్ని ఆబగా కళ్ళలోకి ఒంపుకుంటూ, అక్కడక్కడా ఆగి ఆ అందాలను కెమెరాలో భద్ర పరుస్తూ నడక సాగించాను. ఎదురుగా అద్భుతమైన కట్టడం ఆవిష్కృత మైంది. అదే తోడై - జి దేవాలయం. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన బౌద్ధ దేవాలయాలలో ఒకటి. దీని నిర్మాణం క్రీ.శ. 745 లో మొదలై 752 లో పూర్తయింది. ఆ కాలంలో దేశంలో ప్రబలిన అంటు వ్యాధులు, కరువు కాటకాలనుంచి రక్షణ పొంది, శాంతిని నెలకొల్పడానికి ఈ ఆలయ నిర్మాణం జరిగిందని గైడ్ చెప్పాడు.
ప్రస్తుతం ఉన్న భవనం పాత నమూనాతోనే క్రీ శ 1709 లో పునర్నిర్మించబడింది. అది అసలు కట్టడం కంటే చిన్నదిగా ఉన్నది. ప్రాచీన దేవాలయం లోపల ప్రాచీన నిర్మాణం నమూనా ఉన్నది. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరున్న భారీ దారు ద్వారానికి ఇరువైపులా రెండు ద్వారపాలకుల అద్భుతమైన విగ్రహాలున్నాయి. ఈ ప్రవేశ మార్గాన్ని " నందైమాన్ గేట్ " అని అంటారు. ఆ ద్వారపాలకులను " నియో గార్డియన్ కింగ్స్ " అని పిలుస్తారు. అవి దాటుకొని లోపలికి వెళితే " వైరోచన " బుద్ధుడి ఎత్తైన కాంస్య విగ్రహం మనలను స్థాణువులను చేస్తుంది. దాని ఎత్తు 15 మీటర్లు. దాదాపు 50 అడుగులు. ఆ విగ్రహాన్ని తయారు చేయడంలో లక్షలాది శిల్పులు పాల్గొన్నారట.
వైరోచన అంటే బుద్ధుడు కూర్చొని ఉన్న భంగిమ. దీనిని జపనీస్ భాషలో " దైబుత్సు " అంటారు. దైబుత్సు హాలు (కూర్చున్న భంగిమలో ఉన్న బుద్ధుని హాలు) ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క కట్టడాల్లో ఒకటి. ఆ హాలు వెనక వైపున ఒక పెద్ద స్తంభం వుంది. దానికి కింద భాగంలో ఒక రంధ్రం వుంది. అందులోనుంచి దూరి ఆవలివైపుకు వెళ్ళిన వాళ్లకు వచ్చే జన్మలో జ్ఞానోదయం కలుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. పెద్దలు, పిల్లలు దానిలోనుంచి దూరుతున్నారు. అందుకొరకు పెద్ద క్యూ కూడా ఉంది. దానిని చూడగానే మన దగ్గరున్న అరుణాచలం గిరిప్రరిక్షిణ దారిలోని మోక్షమార్గం నాకు గుర్తుకు వచ్చింది. ఏ దేశంలో అయినా ప్రజల విశ్వాసాలు దాదాపు ఒకే మాదిరిగా ఉంటాయనిపించింది.
ఆవరణలో మొదట కనిపించే చారిత్రక భవనం ప్రస్తుతం కెఫ్టీరియాగా మారింది. అందంగా ఆకర్షించే రాజసౌధంలోకి ప్రవేశం నిషిద్ధం. మరికొన్ని కట్టడాలు శిథిలావస్థలో ఉన్నాయని, సమయాభావం వల్ల కూడా అన్నింటిని చూడలేదు. బౌద్ధ మందిరంలోనుంచి తిరిగి వస్తుoటే బయట ఆవరణలో ఒక చెట్టు కింద ఇద్దరు బాలురు జానపద క్రీడనొకదానిని ప్రదర్శిస్తున్నారు. అది చాలా ఉత్సాహంగా కొనసాగుతోంది. కాసేపు దానిని చూసి అక్కడినుంచి మేం నడుచుకుంటూ దగ్గరలోని నారా జింకలపార్కుకు వెళ్ళాం.
దానిని " నారా కోయెన్ " అని కూడా పిలుస్తారు. జపాన్ లోని పర్యాటక ప్రదేశాలలో అది అత్యంత ఆకర్షణీయమైంది. సుమారు 500 హెక్టార్లలో ఉన్న అతి పెద్ద పబ్లిక్ పార్క్ అది. అక్కడ వెయ్యికి పైగా షికా జాతి జింకలు స్వేచ్ఛగా సంచరిస్తాయి. అవి చిన్నగా ఉన్నప్పుడే వాటి కొమ్ములను కత్తిరించడం మేం గమనించాం. అందువల్ల ప్రమాదమేమీ ఉండదు. స్థానిక షింటో మత విశ్వాసాలననుసరించి వాటిని దేవ దూతలుగా పరిగణిస్తారు. జపాన్ వాటిని జాతీయ నిధిగా ( National Treasure ) గుర్తించింది. కనుక వాటికి పూర్తి రక్షణ ఉంటుంది. వాటిని చూసినప్పుడు మన దేశం లోని ద్వారకా పట్టణంలో స్వేచ్ఛగా తిరిగే ఆవులు నాకు గుర్తుకు వచ్చాయి. అండమాన్ లోని రాస్ ఐలాండ్ లో కూడా జింకల పార్కు ఉన్నది. అయితే వాటికి పెద్ద పెద్ద కొమ్మలు ఉండడం వల్ల దగ్గరగా వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
పర్యాటకులు ఆ జింకలకు ఆహారం తినిపిoచడానికి వీలుగా అక్కడ ప్రత్యేకమైన బిస్కట్ ప్యాకెట్లు అమ్ముతారు. వాటిని బియ్యపు పిండితో తయారుచేస్తారట. దానిని షికా - సేన్ బీ అంటారు. ఒక ప్యాకెట్ ధర 200 యెన్లు. నేనూ ఒకటి కొన్నాను. నా చేతిలో ప్యాకెట్ చూసి వెంటనే నాలుగైదు జింకలు గుంపుగా నా దగ్గరకు చేరాయి. నా చేతిలోనుంచి అందుకోవడానికి ఒకదానితో ఒకటి పోటీ పడింది. వాటి వేగాన్ని నేను అందుకోలేక పోయాను. దానికి తోడు ఆ బిస్కట్లు కూడా మన పూతరేకుల లాగా పలుచగా ఉండి విరిగిపోయాయి. అలా కాసేపు జింకల్లో జిoకగా మారి పోయాను. ఇలాంటి ఆనంద ఘడియలు అనుభవించవలసిందే.. కానీ మాటల్లో చెప్పడం కష్టమైన పని.
( ఇంకా వుంది )
____________ ×__________
NOTE : పేర్లను పలకడంలో భిన్న ఉచ్ఛారణలు ఉన్నందువల్ల ఇంగ్లీషు పదాన్ని బ్రాకెట్లో ఇచ్చాను.
గిరిజ పైడిమర్రి
ట్రావెలర్
9949443414






