- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold: మళ్లీ పరుగులు పెట్టిన బంగారం
మరోవైపు వెండి కూడా తన ర్యాలీని కొనసాగించింది. కిలోకు రూ.5,000 పెరిగి రూ.2,40,000 వద్ద ట్రేడయింది.

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, అమెరికా డాలర్ బలహీనపడటం, సురక్షిత పెట్టుబడిగా బంగారంపై మళ్లీ డిమాండ్ పెరగడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. జాతీయ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు ఒక్కరోజే రూ.3,000 పెరిగి రూ.1,47,500కు చేరింది. దీంతో వరుసగా రెండు రోజుల పతనానికి తెరపడింది. మరోవైపు వెండి కూడా తన ర్యాలీని కొనసాగించింది. కిలోకు రూ.5,000 పెరిగి రూ.2,40,000 వద్ద ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ దాదాపు 1 శాతం పెరిగి ఔన్సుకు 4,070 డాలర్ల వద్ద, వెండి 59.89 డాలర్ల వద్ద ట్రేడవడం దేశీయ ధరలకు కూడా మద్దతు ఇచ్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి వడ్డీ రేట్లపై తక్షణ కఠిన నిర్ణయాలు వచ్చే అవకాశాలు తగ్గడం కూడా బంగారం కొనుగోళ్లకు ఊతమిచ్చిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ. 3,000 పెరిగి రూ. 1,45,740 వద్ద ఉంది. ఆభరణాల్లో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 2,750 పెరిగి రూ. 1,33,350కి చేరింది. వెండి కిలో రూ. 2.55 లక్షల వద్ద ఉంది. మరోవైపు, భౌగోళిక ఉద్రిక్తతలు కొంత తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోవడం, ఐటీ షేర్లలో బలమైన కొనుగోళ్లు కలిసి గురువారం దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఊపునిచ్చాయి. దీంతో సెన్సెక్స్ 579.48 పాయింట్లు లాభపడి 77,502 వద్ద ముగియగా, నిఫ్టీ 169.85 పాయింట్లు ఎగిసి 24,175 వద్ద నిలిచింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 4 శాతానికి పైగా పుంజుకుని భారీగా ర్యాలీ చేయడంతో ఐటీ రంగం మార్కెట్‌కు ప్రధాన బలంగా నిలిచింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 95.23 వద్ద ఉంది.






