బాలుడి కిడ్నాప్‌ సుఖాంతం

by Ratna Kumari |   (  Updated:2026-07-02 17:01:24  IST  )

బాలుడి కిడ్నాప్‌ సుఖాంతం
X

దిశ, పేట్‌బషీరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌కు గురైన మూడేళ్ల బాలుడు నిఖిల్‌ను జీడిమెట్ల పోలీసులు సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. 12 రోజుల పాటు సాగిన గాలింపు అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలుడిని క్షేమంగా రక్షించారు. పోలీసుల వివరాల ప్రకారం.. గత నెల 20న మూడేళ్ల నిఖిల్ తన అమ్మమ్మతో కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. రైలు ఆలస్యం కావడంతో ఇద్దరూ ప్లాట్‌ఫాంపై నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అమ్మమ్మ కొంగుకు కట్టి ఉన్న బాలుడిని చాకచక్యంగా అపహరించి తీసుకెళ్లాడు. తెల్లవారుజామున నిద్రలేచిన అమ్మమ్మ మనవడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సవాల్‌గా మారిన దర్యాప్తు..

కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్‌లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా నిందితుడి ముఖం స్పష్టంగా రికార్డైంది. అయితే, నిందితుడు ఎలాంటి గుర్తింపు పత్రాలు సమర్పించకుండా ఓయో గదిలో బస చేయడంతో అతడి వివరాలు సేకరించడం పోలీసులకు సవాల్‌గా మారింది.

12 రోజుల గాలింపు.. నిందితుడి అరెస్ట్..

ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో 12 రోజుల పాటు గాలింపు చేపట్టారు. చివరకు జీడిమెట్లలోని ఓ హోటల్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలుడిని సురక్షితంగా రక్షించారు. అనంతరం బాలుడిని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

తల్లిదండ్రులకు అప్పగింత..

జీడిమెట్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్ గడ్డం మల్లేష్ స్వయంగా బాలుడిని ఓదార్చి తల్లితో వీడియో కాల్‌లో మాట్లాడించారు. బాలుడికి ఆహారం అందించి ధైర్యం చెప్పారు. అనంతరం రైల్వే పోలీసుల సమక్షంలో బాలుడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. సకాలంలో స్పందించి బాలుడిని క్షేమంగా రక్షించిన పోలీసులను కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు.

Next Story