సేవా కార్యక్రమాలతో సమాజంలో వెలుగులు నింపాలి: మంత్రి సీతక్క

by Batti.Sumithra |

వెనుకబడిన, అటవీ ప్రాంత జిల్లాగా పేరుగాంచిన ములుగు జిల్లా నేడు విద్యారంగంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని, విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

సేవా కార్యక్రమాలతో సమాజంలో వెలుగులు నింపాలి: మంత్రి సీతక్క
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : వెనుకబడిన, అటవీ ప్రాంత జిల్లాగా పేరుగాంచిన ములుగు జిల్లా నేడు విద్యారంగంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని, విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో, రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి 50 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లా నిరక్షరాస్యత అధికంగా ఉన్నప్పటికీ జిల్లా అధికారులు, విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమిష్టి కృషి ఫలితంగా ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో తొలి స్థానం, ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలో రెండో స్థానం సాధించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.

ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తోందని పేర్కొన్న ఆమె, కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు రోటరీ క్లబ్ సభ్యులు అందిస్తున్న సేవలను ఎన్నటికీ మరువలేమని అన్నారు. జిల్లాలో సేవా, సహాయ కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చే స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రతి మహిళను అక్షరాస్యత వైపు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడం సంతోషకరమని అన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్మన్ ఆసియా షాహిన్, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీఐఈఓ వీరేంద్ర కుమార్, రోటరీ క్లబ్ ప్రతినిధులు చంద్రమౌళి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story