తహసీల్దార్ ఉన్నట్లా.. లేనట్టా..?

by Kodari Anjali |

ఇల్లందకుంట మండల తహసీల్దార్‌ను జమ్మికుంట మండలానికి ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో అప్పటినుంచి ఇల్లందకుంటకు బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తహసీల్దార్ ఉన్నట్లా.. లేనట్టా..?
X

దిశ, జమ్మికుంట: ఆయనో మండల దేవుడు.. కానీ ఆయన దర్శనం కోసం ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సి వస్తోంది. అధికారికంగా విధులు నిర్వహించాల్సిన చోట 'డుమ్మా' కొట్టి, అదనపు బాధ్యతలు అప్పగించిన చోట మాత్రం 'అంకితభావం' ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ఇల్లందకుంట మండల తహసీల్దార్ కార్యాలయం బోసిపోయి కనిపిస్తుండగా, ప్రజల సమస్యలు అటకెక్కాయి.

సొంత కార్యాలయానికి రాకపోకలు బంద్..!

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల తహసీల్దార్‌కు పొరుగునే ఉన్న జమ్మికుంట మండలానికి ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతే.. అప్పటి నుంచి సదరు అధికారికి సొంత మండలం ఇల్లందకుంట అసలు గుర్తుకే రావడం లేదు. ఈ నెల 3వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆయన ఇల్లంతకుంట కార్యాలయం వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఒక్కరికే రెండు చోట్ల బాధ్యతలు అప్పగించడం, ఆయన ఒకే చోటుకు పరిమితం కావడంతో ఇల్లందకుంటలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా పడకేసింది.

కుప్పలు కుప్పలుగా పెండింగ్ ఫైళ్లు..

తహసీల్దార్ గైర్హాజరుతో కార్యాలయంలో ఫైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన దరఖాస్తులపై సంతకాలు చేసే నాథుడే కరువయ్యాడు. వివిధ సర్టిఫికెట్లు, భూమి సమస్యలు, ఇతర అత్యవసర పనుల కోసం మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రతిరోజూ వస్తున్న వృద్ధులు, రైతులు, విద్యార్థులకు నిరాశే మిగులుతోంది. పొద్దున వచ్చి సాయంత్రం వరకు కార్యాలయం మెట్లపై కూర్చొని, అధికారి రాలేదని తెలిసి భారంగా వెనుతిరుగుతున్నారు.

ఇన్‌చార్జి కార్యాలయంపైనే ఎందుకంత మోజు..?

అసలు ఉద్యోగం ఉన్న ఇల్లందకుంటను వదిలేసి, జమ్మికుంట కార్యాలయానికే తహసీల్దార్ అంకితం కావడానికి కారణమేంటనే సంశయాలు ఇప్పుడు మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జమ్మికుంట కార్యాలయంలో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ 'ఆదాయం' బాగుండడం వల్లే, ఇల్లందకుంట కార్యాలయాన్ని గాలికొదిలేశారనే విమర్శలు ప్రజల నుండి బలంగా వినిపిస్తున్నాయి.

ప్రజల డిమాండ్...

అధికారికంగా విధులు నిర్వహించాల్సిన చోట నిర్లక్ష్యం వహిస్తూ, ఇన్‌చార్జి సీటులోనే తిష్టవేసిన అధికారిపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇల్లందకుంట కార్యాలయానికి పూర్తిస్థాయి తహసీల్దార్‌ను కేటాయించి, పేరుకుపోయిన ఫైళ్లను వెంటనే పరిష్కరించి ప్రజల ఇబ్బందులను తొలగించాలి."

Next Story