- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జలమండలి ఎండీ ఆకస్మిక తనిఖీ.. అధికారులకు కీలక ఆదేశాలు
ఖైరతాబాద్ పరిధిలో మురుగునీటి సమస్యలపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని నవీన్ నగర్ కాలనీ, ఆనంద్‌నగర్ ప్రాంతాల్లో నెలకొన్న సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్యలపై జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రోడ్లపై నిలిచిపోతున్న మురుగు నీటి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఎండీ, సంబంధిత అధికారులతో కలిసి సమస్యల మూలకారణాలపై సమీక్ష నిర్వహించారు.
సీవరేజ్ లైన్లలో పేరుకుపోయిన పూడిక కారణంగా పలు ప్రాంతాల్లో ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక డీ-సిల్టింగ్ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వారానికి కనీసం ఒక్కసారైనా ప్రతి మ్యాన్‌హోల్‌ను తనిఖీ చేసి డీ-సిల్టింగ్ నిర్వహించాలని సూచించారు. డీ-సిల్టింగ్ చేపట్టిన మురుగు లైన్ల వివరాలు, మ్యాన్‌హోల్స్‌లో నుంచి తొలగించిన పూడిక పరిమాణం, చేపట్టిన నిర్వహణ పనుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. తరచూ ఓవర్‌ఫ్లో అయ్యే మ్యాన్‌హోళ్లను గుర్తించి వాటిపై రెడ్ పెయింట్‌తో వేయాలని ఎండీ ఆదేశించారు. దీని ద్వారా సమస్యాత్మక మ్యాన్‌హోళ్లను త్వరితగతిన గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కస్టమర్ కేర్‌కు తరచూ ఫిర్యాదులు అందుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అటువంటి సమస్యాత్మక ప్రాంతాలపై వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించి, సమస్యల కారణాలను గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
మురుగు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో సంబంధిత ప్రాంతాల్లో సమగ్ర సర్వే నిర్వహించి, అవసరమైన సాంకేతిక ప్రతిపాదనలతో కూడిన నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని అధికారులకు సూచించారు. అవసరమైతే సీవరేజ్ లైన్ల అప్‌గ్రేడేషన్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులకు సూచించారు. వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా సీవరేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని, ఫీల్డ్ స్థాయిలో అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలని ఎండీ అశోక్ రెడ్డి సూచించారు.
కూలిపోయిన 15 ఏళ్ల మ్యాన్ హోల్..
అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరిశీలనలో, సుమారు 15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక డీప్ మ్యాన్‌హోల్ దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దెబ్బతిన్న మ్యాన్‌హోల్‌ను పునర్నిర్మించడం ద్వారా ఆ ప్రాంతంలో తరచూ సంభవిస్తున్న సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్యకు గణనీయంగా పరిష్కారం లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ ప్రభులతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






