సంక్షేమాన్ని గడపగడపకు తీసుకెళ్లండి

by Taduka Kalyani |

తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కీలక పాత్ర పోషించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.

సంక్షేమాన్ని గడపగడపకు తీసుకెళ్లండి
X

దిశ, రవీంద్ర భారతి : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కీలక పాత్ర పోషించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ సంక్షేమ ఫలాలను గడపగడపకు చేర్చాల్సిన ప్రధాన బాధ్యత కళాకారులపైనే ఉందన్నారు. రవీంద్రభారతిలో 'తెలంగాణ సాంస్కృతిక సారథి' ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ... క‌ళాకారుల‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు గుర్తింపు కార్డుల‌ను అంద‌జేశారు. ద‌శ‌ల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల మంది క‌ళాకారుల‌కు ఐడింటీ కార్డుల‌ను అంద‌జేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి చెప్పారు. కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడటంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సాంస్కృతిక సారథి కళాకారులకు కూడా ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు అందేలా చూస్తామ‌ని భ‌రోసానిచ్చారు. దీంతో పాటు అర్హులైన కళాకారులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉన్న అర్హులైన కళాకారులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు. కళాకారుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌ దృష్టికి తీసుకువెళ్లిన‌ట్లు చెప్పారు. ఈ అవగాహన సదస్సులో తెలంగాణ సాంస్కృతిక సార‌ధి చైర్ ప‌ర్స‌న్ వెన్నెల గ‌ద్ద‌ర్, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్ ఏనుగు న‌ర్సింహారెడ్డి, సారథి ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన కళాకారులు పాల్గొన్నారు.

Next Story