20 నెలల్లో రూ.30 కోట్లు స్వాహా.. సంచలన నిజాలు వెల్లడించిన శిఖా గోయల్

by Kema Shiva Kumar |

తెలంగాణలో సైబర్ కేటుగాళ్ల మెయిన్ టార్గెట్‌గా వైద్యులు మారుతున్నారు.

20 నెలల్లో రూ.30 కోట్లు స్వాహా.. సంచలన నిజాలు వెల్లడించిన శిఖా గోయల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజారోగ్యం కోసం శ్రమిస్తూ, ప్రాణాలు కాపాడే వైద్యులే ఇప్పుడు సైబర్‌ మాయగాళ్ల మెయిన్ టార్గెట్‌గా మారుతున్నారు. సమాజంలో ఉన్నత విద్యావంతులుగా, బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్న డాక్టర్లను సైతం కేటుగాళ్లు తమ మాయమాటల వలలో వేసుకుని కోట్లు గుంజుతున్నారు. చదువు, పదవులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి అజ్ఞానాన్ని, అత్యాశను లేదా భయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా గడిచిన 20 నెలల కాలంలో అంటే సెప్టెంబర్ 2024 నుంచి ఇప్పటివరకు ఏకంగా 735 మంది వైద్యులు సైబర్‌ వంచనకు గురై, సుమారు రూ.29.88 కోట్లు నష్టపోయినట్లు సంచలన గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ పెరుగుతున్న సైబర్‌ ముప్పుల నేపథ్యంలో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ మంగళవారం హైదరాబాద్‌లో వైద్య రంగ ప్రముఖులతో ఒక ఉన్నత స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం చదువుకున్న వారు లేదా ఉన్నత వృత్తిలో ఉన్నవారు అన్న కారణంతో ఎవరూ సైబర్‌ నేరాలకు అతీతులు కారని, ఇక్కడ అప్రమత్తత ఒక్కటే మనల్ని కాపాడుతుందని హెచ్చరించారు. వైద్యులు సంపాదనను లాభదాయకమైన మార్గాల్లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనను సైబర్‌ నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. డాక్టర్లు ప్రధానంగా బిజినెస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాల వలలో పడి భారీగా ఆస్తులు కోల్పోతున్నట్లు పోలీసులు గుర్తించారు.

735 మంది వైద్యులు.. సుమారు రూ.29.88 కోట్లు

ఈ ఒక్క కేటగిరీలోనే 127 మంది వైద్యులు ఏకంగా రూ.22.39 కోట్లు పోగొట్టుకున్నారు. వీరి తర్వాతి స్థానాల్లో ముంబై పోలీసులమంటూ, సీబీఐ అధికారులమంటూ భయపెట్టే డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో 22 మంది నుంచి రూ.2.26 కోట్లు దోచేశారు. అలాగే డాక్టర్ల వ్యక్తిగత వివరాలను దొంగిలించి గుర్తింపు చోరీ ద్వారా 144 మంది నుంచి రూ.2.05 కోట్లు నేరగాళ్లు కాజేశారు.

వీటితో పాటు తాము ప్రభుత్వ ఉన్నతాధికారులమంటూ ఫోన్లు చేసి బెదిరింపులకు గురిచేసే ఇంపర్సనేషన్ మోసాల్లో 181 మంది రూ.1.32 కోట్లు, ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్, నకిలీ ప్రకటనల మోసాల్లో 188 మంది రూ.1.17 కోట్లు నష్టపోయారు. కేవలం ఇవే కాకుండా సెక్స్‌టార్షన్, నకిలీ పార్సిల్ స్కామ్‌లు, ఉద్యోగ మోసాలు, ఇన్సూరెన్స్, క్రిప్టో కరెన్సీ, మ్యాట్రిమోనియల్ స్కామ్‌ల ద్వారా కూడా వైద్యులు పెద్ద ఎత్తున బాధితులుగా మారుతుండటం గమనార్హం. వైద్య రంగంలో సైబర్‌ భద్రతను పటిష్టం చేసేందుకు టీజీసీఎస్‌బీ, వైద్య సంఘాలు కలిసికట్టుగా పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. భవిష్యత్తులో నిర్వహించే వైద్య సదస్సులు, ఆసుపత్రుల అంతర్గత సమావేశాలు, ఇతర విద్యా కార్యక్రమాలలో సైబర్‌ భద్రతా సూచనలను, నివారణా చర్యలను విస్తృతంగా ప్రచారం చేయాలని సంకల్పించారు.

టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖా గోయల్‌...

ఈ మోసాల బారి నుంచి తప్పించుకోవడానికి గోల్డెన్‌ అవర్‌ కీలకమని స్పష్టం చేశారు. ఒకవేళ పొరపాటున సైబర్‌ ఆర్థిక మోసం జరిగిన వెంటనే, అంటే తొలి గంటలోనే 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేయడం లేదా నేషనల్‌ సైబర్‌ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా బ్యాంక్ ఖాతాల్లోని బాధితుల సొమ్మును తక్షణమే స్తంభింపజేసే అవకాశం ఉంటుందని ఆమె వివరించారు. తద్వారా ఆ సొమ్మును తిరిగి రాబట్టి బాధితులకు న్యాయం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.పి.కిషన్, తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్‌ రఘునాథ్ రెడ్డి, ఎస్పీలు హర్షవర్ధన్, బి.సాయిశ్రీ సహా విభిన్న స్పెషాలిటీ విభాగాల ప్రతినిధులు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story