త్వరలోనే మారనున్న కాళేశ్వరం ఆలయ రూపురేఖలు

by Batti.Sumithra |

అత్యంత అరుదైన, చారిత్రాత్మక పుణ్యక్షేత్రంగా పేరొందిన కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయం మరోసారి పునర్నిర్మాణానికి సిద్ధమవుతోంది.

త్వరలోనే మారనున్న కాళేశ్వరం ఆలయ రూపురేఖలు
X

​దిశ, మహదేవపూర్ : అత్యంత అరుదైన, చారిత్రాత్మక పుణ్యక్షేత్రంగా పేరొందిన కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయం మరోసారి పునర్నిర్మాణానికి సిద్ధమవుతోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఆధునిక హంగులతో, సకల వసతులతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 198 కోట్ల భారీ బడ్జెట్‌ను మంజూరు చేసింది.

​పెరుగుతున్న భక్తుల రద్దీ.. మంత్రి శ్రీధర్ బాబు చొరవ

గతంలో 1970వ దశాబ్దంలో ఈ ఆలయానికి జీర్ణోద్ధారణ (మరమ్మతులు) చేసి, ఆనాటి అవసరాలకు తగ్గట్టుగా వసతులు కల్పించారు. అయితే, ఇటీవల కాలంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడడం, క్షేత్ర ప్రాశస్త్యం విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో కాళేశ్వరానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక (మంథని) ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆలయ సమగ్ర అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ​వచ్చే ఏడాది (2027) ప్రతిష్టాత్మక గోదావరి నది పుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసిన ప్రభుత్వం, అంతకంటే ముందే ఆలయాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని నిర్ణయించింది.

శృంగేరీ పీఠం దిశానిర్దేశంలో మాస్టర్ ప్లాన్..

​ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల రూపురేఖలను మార్చేందుకు దేవాదాయ శాఖ అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రసిద్ధ శృంగేరీ పీఠం దిశానిర్దేశంలో, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఈ నిర్మాణ పనులు జరగనున్నాయి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ నేతృత్వంలో ఈ ప్రాజెక్టు పై ప్రత్యేక నిఘా ఉంచారు.

మంగళవారం ఉన్నతాధికారుల సమీక్ష..

​ఈ పునర్నిర్మాణ పనుల పై దేవాదాయ శాఖ కమిషనర్ మంగళవారం కాళేశ్వరంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి నది తీరంలో సరికొత్త పుష్కర ఘాట్ల నిర్మాణం, భక్తుల వసతి గృహాలు, ఇతర అనుబంధ భవనాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఖరారు చేశారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరలోనే ఈ పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story