ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణుల నరకయాతన

by Batti.Sumithra |

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణుల నరకయాతన
X

దిశ, సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందలాది మంది గర్భిణీలు వైద్య పరీక్షల (చెకప్‌ల) కోసం ఆసుపత్రికి వస్తున్నప్పటికీ, వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆసుపత్రి యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూర్చోవడానికి కుర్చీలు, బెంచీలు లేకపోవడంతో గర్భిణీలు గంటల తరబడి నేలపైనే కూర్చొని తమ వంతు కోసం వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజూ వందలాది మంది గర్భిణీలు వైద్య పరీక్షల కోసం వస్తుంటారు.

అయితే, ఓపీ విభాగం వద్ద గర్భిణీలు కూర్చోవడానికి కనీసం కుర్చీలు లేదా బెంచీలు కూడా అందుబాటులో లేకపోవడంతో, నెలలు నిండిన గర్భిణీలు నేలపైనే కూర్చొని గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఓపీ లైన్‌లో ఎక్కువసేపు నిలబడలేక, కూర్చోవడానికి కూడా స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి పై గర్భిణీల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీలు ఇంతగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఆసుపత్రిలో కుర్చీలు, బెంచీలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలను కల్పించి గర్భిణీలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story