Piyush Goyal: పెట్టుబడులకు ఇదే రైట్ టైమ్

by S Gopi |

ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో ఒకటైన భారత్‌లో కొత్త ఆలోచనలకు, కొత్త బిజినెస్ మోడల్స్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడిదారులను మార్కెట్‌తో అనుసంధానించడంలో ప్రభుత్వం కూడా సహకరిస్తుందని పేర్కొన్నారు.

Piyush Goyal: పెట్టుబడులకు ఇదే రైట్ టైమ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని, మరింత ఆలస్యం చేయకుండా దేశీయ పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు, వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లు స్టార్టప్‌లు, కొత్త ఆవిష్కరణలపై పెట్టుబడులు పెంచాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఫ్రాన్స్‌లో జరిగిన ‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, భారత స్టార్టప్ వ్యవస్థ ఇప్పుడు కొత్త దశకు చేరుకుందని, పెట్టుబడులకు అవసరమైన విధానాలు, మార్కెట్ అవకాశాలు, మద్దతు వ్యవస్థలు అన్నీ సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో ఒకటైన భారత్‌లో కొత్త ఆలోచనలకు, కొత్త బిజినెస్ మోడల్స్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడిదారులను మార్కెట్‌తో అనుసంధానించడంలో ప్రభుత్వం కూడా సహకరిస్తుందని పేర్కొన్నారు. తయారీ రంగ సంస్థలు స్టార్టప్‌లతో భాగస్వామ్యం పెంచి, భారత్‌ను కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలకు పరీక్షా వేదికగా మార్చాలని గోయల్ సూచించారు.

పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు కలిసి పనిచేస్తే ఆవిష్కరణలను మార్కెట్‌లోకి తీసుకురావడానికి పట్టే సమయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. స్టార్టప్‌లకు మద్దతుగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా రూ. 10,000 కోట్ల ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్’ రెండో విడతలో ఎక్కువ భాగాన్ని డీప్‌టెక్ సంస్థలు, ఆవిష్కర్తల కోసం కేటాయించనున్నట్లు వెల్లడించారు. అలాగే, భారత్ ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) ప్రయోజనాలను పరిశ్రమలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ స్టార్టప్‌లు, పరిశోధకులు, టెక్ ప్రొఫెషనల్స్‌ను తిరిగి భారత్‌కు రప్పించే మార్గాలపై కూడా ప్రభుత్వం సూచనలు కోరుతున్నట్లు తెలిపారు.

Next Story