- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంద సీట్లకు తగ్గకుండా మేమే గెలుస్తున్నాం : మహేష్ గౌడ్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో వంద సీట్లు తగ్గకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి పక్కాగా వస్తుందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు.

దిశ, సంగారెడ్డి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో వంద సీట్లు తగ్గకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి పక్కాగా వస్తుందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఎస్ఐఆర్ శిక్షణ శిబిరానికి ఆయన స్థానిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ 2002లోనే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) జరిగిందని, అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లింగో ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పన న్యాయబద్ధంగా జరిగిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ అంతా అందుకు భిన్నంగా సాగుతోందని చెప్పారు. తాజాగా జరిగిన బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీ ఎస్ఐఆర్ ద్వారా చేసిన కుట్రలు తేటతెల్లం అవుతున్నాయని తెలిపారు. అయితే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించేందుకు అక్కడ 92 లక్షల ఓట్లను దీని ద్వారా తొలగించడం అన్యాయమన్నారు. ఇదిలా ఉంటే గాంధీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించే మీనాక్షి నటరాజన్ ను తప్పుడు దారిలో ఆమెకు రావాల్సిన రాజ్యసభ సీటును లాగేసుకున్నారని మండిపడ్డారు. గొప్ప గొప్ప చక్రవర్తులే నేలకు దిగిపోయారని, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పులో మోడీ, అమిత్ షాలు ఎంత అన్నారు. జైశ్రీరామ్ అంటూ దేవుడు పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దేవుడు పేరు చెప్పి ఓట్లు అడిగే అలవాటు లేదని స్పష్టం చేశారు.
మాకు ఎవరి సహకారం అవసరం లేదు..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 85 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమదేనని, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. ఇకపోతే కమలం పార్టీ ఏ విధంగా ఆడిస్తే పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఆడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి స్థానిక బీఎల్ఏలు, బీఎల్వోలు శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు.
ప్రతి ఓటర్లను కాపాడుకోవడం మన బాధ్యత.. మంత్రి దామోదర రాజనర్సింహ
ఎస్ఐఆర్ శిక్షణ శిబిరానికి వచ్చిన బీఎల్ ఏలు, బీఎల్ఓలు ఒకటికి నాలుగు సార్లు ఈ అంశం పై అవగాహన పెంచుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. దీని ద్వారా ప్రతి ఒక్క ఓటరును కాపాడుకోవడం తమ వంతు బాధ్యతగా భావించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా మండల స్థాయి మీటింగులు నిర్వహించుకొని అందుకు తగ్గ కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్, ఇన్చార్జి దయాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






