Digital Fraud Rate: డిజిటల్ మోసాల్లో భారత్ టాప్

by S Gopi |

వేగవంతమైన లావాదేవీలు, విస్తృత నెట్‌వర్క్‌లు, నిరంతర కస్టమర్ ఇంటరాక్షన్లు ఎక్కువగా ఉండటంతో ఈ రంగాలు సైబర్ మోసగాళ్లకు సులభ లక్ష్యాలుగా మారుతున్నాయని నివేదిక పేర్కొంది.

Digital Fraud Rate: డిజిటల్ మోసాల్లో భారత్ టాప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మోసాల బెడద పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అత్యంత ప్రభావిత దేశాల్లో ఒకటిగా నిలిచింది. ట్రాన్స్‌యూనియన్ విడుదల చేసిన ‘టాప్ ఫ్రాడ్ ట్రెండ్స్ రిపోర్ట్’ ప్రకారం, 2025లో భారతీయ వినియోగదారులతో జరిగిన డిజిటల్ లావాదేవీల్లో 7.1 శాతం మోసపూరిత ప్రయత్నాలు జరిగాయి. ఇది ప్రపంచ సగటు 3.8 శాతంతో పోలిస్తే దాదాపు రెండింతలు ఎక్కువ కావడం గమనార్హం. రంగాల వారీగా చూస్తే లాజిస్టిక్స్ విభాగం అత్యధిక ప్రమాదంలో ఉంది. ఈ రంగంలో 16.3 శాతం లావాదేవీలు మోసాలకు సంబంధించినవిగా గుర్తించగా, టెలికమ్యూనికేషన్స్‌లో 14.7 శాతం, బీమా రంగంలో 11.5 శాతం నమోదయ్యాయి. వేగవంతమైన లావాదేవీలు, విస్తృత నెట్‌వర్క్‌లు, నిరంతర కస్టమర్ ఇంటరాక్షన్లు ఎక్కువగా ఉండటంతో ఈ రంగాలు సైబర్ మోసగాళ్లకు సులభ లక్ష్యాలుగా మారుతున్నాయని నివేదిక పేర్కొంది.

రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సైబర్ నేరగాళ్లు ఇప్పుడు తమ పద్ధతిని మార్చారు. కొత్త అకౌంట్లు తెరవడం కంటే, ప్రస్తుతం వాడుకలో ఉన్న కస్టమర్ల అకౌంట్లను దొంగిలించడం (హ్యాక్ చేయడం) పైనే వారు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త అకౌంట్లు క్రియేట్ చేసేటప్పుడు మోసాలు ఎక్కువగా జరుగుతుంటే, భారత్‌లో మాత్రం కస్టమర్లు అకౌంట్లలోకి 'లాగిన్' అయ్యేటప్పుడే ముప్పు ఎక్కువగా ఉంటోందని ఈ నివేదిక చెప్పింది.

పాస్‌వర్డ్‌లను దొంగిలించి హ్యాకింగ్

మనదేశంలో జరిగే లాగిన్ ప్రయత్నాలలో 3.9 శాతం అనుమానాస్పదంగా ఉంటున్నాయి. అదే సమయంలో కొత్త అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు 3.1 శాతం, డబ్బులు పంపేటప్పుడు (ఆర్థిక లావాదేవీలు) 1.2 శాతం మాత్రమే మోసాలు జరుగుతున్నాయి. వేరే చోట లీకైన లేదా దొంగిలించిన పాస్‌వర్డ్‌లను ఉపయోగించి కస్టమర్ల అకౌంట్లను హ్యాక్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని ట్రాన్స్‌యూనియన్ హెచ్చరించింది. అందువల్ల వ్యాపార సంస్థలు కేవలం కొత్త కస్టమర్ల గురించే కాకుండా, పాత కస్టమర్లు లాగిన్ అయ్యేటప్పుడు కూడా భద్రతను మరింత కఠినతరం చేయాలని నివేదిక సూచించింది.

Next Story