- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్న వర్షానికే జలమయం.. కర్మన్‌ఘాట్ భాగ్యనగర్ కాలనీవాసుల దుస్థితి
నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కర్మన్‌ఘాట్ భాగ్యనగర్ కాలనీ జలమయమైంది.

దిశ, చంపాపేట్: నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కర్మన్‌ఘాట్ భాగ్యనగర్ కాలనీ జలమయమైంది. హనుమాన్ టెంపుల్ సమీపంలోని ఫేజ్-11 పరిధిలోని రోడ్డు నంబర్లు 6, 7, 8, 8Aల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9:30 గంటలు దాటిన రోడ్లపై నీరు తగ్గకపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా వీలు లేకపోయింది. మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోవడంతో చిన్నారులు, వృద్ధులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాల రాకపోకలు స్తంభించగా, అత్యవసర అవసరాల కోసం బయటికి వెళ్లాల్సిన వారు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు.
ప్రతి చిన్నపాటి వర్షం కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, ఇప్పటికే ఉన్న కాలువలు పూడికతో నిండిపోవడం, వర్షపు నీటి పారుదల పై అధికారులు నిర్లక్ష్యం వహించడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఏళ్లుగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడం లేదని కాలనీవాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణమే స్పందించి నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు వర్షపు నీరు వేగంగా వెళ్లేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. స్థానిక ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే రాబోయే వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






