- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడిరోడ్డుపై భారీ గొయ్యి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం
ఆర్మూర్–ఆలూర్–నందిపేట్ ప్రధాన రహదారి మరోసారి మృత్యుకూపంగా మారింది.

దిశ, ఆలూర్: ఆర్మూర్–ఆలూర్–నందిపేట్ ప్రధాన రహదారి మరోసారి మృత్యుకూపంగా మారింది. వర్షాల కారణంగా రోడ్డు పూర్తిగా గుంతలమయమై, ముఖ్యంగా నడిరోడ్డులో ఏర్పడిన భారీ గొయ్యి వాహనదారులకు పెను ప్రమాదంగా మారింది. ఈ మార్గంలో ప్రతి రోజూ వందలాది మంది ప్రయాణికులు, ఆర్టీసీ బస్సులు, పాఠశాల వాహనాలు, అంబులెన్స్‌లు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులతో రాకపోకలు సాగిస్తుండగా, ప్రతి ప్రయాణం ప్రాణాలతో చెలగాటంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం..
రోడ్డు మధ్యలో ఏర్పడిన లోతైన గొయ్యిలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో దాని లోతు అంచనా వేయడం కష్టంగా మారింది. గుంతల చుట్టూ పేరుకుపోయిన ఇసుక కారణంగా ద్విచక్ర వాహనాలు జారి పడుతున్నాయి. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారి, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా గుంతల్లో ఇరుక్కుపోయి ఒకవైపు ఒరిగే పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
గతేడాది సీన్.. ఈ ఏడాది మళ్లీ రిపీట్
ఈ రహదారి సమస్య కొత్తది కాదని స్థానికులు చెబుతున్నారు. గత వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనగా, అప్పట్లో అధికారులు నామమాత్రంగా గుంతలను పూడ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు. నాణ్యతలేని మరమ్మతుల కారణంగా కొద్దిరోజుల్లోనే రోడ్డు మళ్లీ పాడై ప్రస్తుతం మరింత ప్రమాదకరంగా మారిందని అంటున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలం వస్తే ఇదే దుస్థితి పునరావృతమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం..
రోడ్డుపై భారీ గొయ్యిలు ఏర్పడిన విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి శాశ్వత చర్యలు చేపట్టలేదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రమాదం జరిగాక స్పందించడం కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తక్షణమే మరమ్మతులు చేపట్టాలి..
ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ రహదారిపై జిల్లా అధికారులు, రోడ్లు-భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. తాత్కాలిక పూడిక పనులు కాకుండా శాశ్వతంగా నాణ్యమైన రహదారిని నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే ఎప్పుడైనా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






