- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా ఎగువన నీటి నిల్వలు
కర్ణాటక, మహారాష్ట్రలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలో నీటి నిల్వలు పెరుగుతున్నప్పటికీ దిగువ తెలంగాణకు నీటి విడుదల లేకపోవడంతో కృష్ణా నది అడుగంటిపోయిన పరిస్థితి నెలకొంది.

దిశ, మక్తల్ : కర్ణాటక, మహారాష్ట్రలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలో నీటి నిల్వలు పెరుగుతున్నప్పటికీ దిగువ తెలంగాణకు నీటి విడుదల లేకపోవడంతో కృష్ణా నది అడుగంటిపోయిన పరిస్థితి నెలకొంది. నదిలో నీటి ప్రవాహం లేక పలుచోట్ల రాళ్లు బయటపడగా, కర్ణాటక నుంచి నీటి విడుదల కోసం తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా కర్ణాటక ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మించిన బ్యారేజీలు, రోడ్‌కమ్ బ్యారేజీల ద్వారా నీటిని నిల్వ చేసుకుంటుండటంతో దిగువ రాష్ట్రాలకు నీటి ప్రవాహం తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తిగా నిండే వరకు చుక్క నీటినైనా దిగువకు వదలడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
గత ఏడాది జూలై నాటికి తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులు నిండిపోయి, కృష్ణా వరద నీరు ఆంధ్రప్రదేశ్ వరకు చేరిందని రైతులు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్‌లో సుమారు 67 శాతం నీటి నిల్వ ఉండగా, ఇన్‌ఫ్లో సుమారు 1.33 లక్షల క్యూసెక్కులు నమోదవుతున్నప్పటికీ అవుట్‌ఫ్లో చాలా స్వల్పంగా మాత్రమే కొనసాగుతోందని సమాచారం. ఆల్మట్టి నుంచి విడుదలయ్యే నీటిపైనే ఆధారపడే నారాయణపూర్ (బసవసాగర్) డ్యామ్‌కు కూడా ప్రస్తుతం గణనీయమైన వరద నీటి విడుదల లేదని తెలుస్తోంది.
వర్షాకాలం ప్రారంభంలో లభించిన కొద్దిపాటి నీటితో రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకున్నప్పటికీ, ఇప్పుడు నాట్లు వేయాల్సిన సమయంలో కృష్ణా నదికి వరద నీరు రాకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు పంట భవితవ్యంపై ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా కృష్ణా, భీమా నదులకు ఆశించిన స్థాయిలో వరద నీరు రాకపోవడంతో ఈసారి ఖరీఫ్ సాగుపై అనిశ్చితి నెలకొంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి దిగువకు నీటి విడుదల జరిగేలా చర్యలు తీసుకోవాలని మక్తల్ నియోజకవర్గంలోని రైతులు కోరుతున్నారు. నీటి విడుదల జరిగితే జూరాల ప్రాజెక్టుతో పాటు భీమా పరివాహక ప్రాంత రైతులకు కూడా మేలు జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






