- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారం అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
వచ్చే మేడారం మహాజాతరకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : వచ్చే మేడారం మహాజాతరకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు. అలాగే మహాజాతర నాటికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్ల విస్తరణకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేసి పనులు వేగవంతం చేయాలని సూచించారు. గురువారం ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ వనదేవతలను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
తర్వాత మేడారం హరిత హోటల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. క్యూ లైన్లను ఆధునికీకరించడంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. జంపన్న వాగు పరిసరాలను సుందరీకరించాలని, ప్రధాన రహదారుల ఇరువైపులా డివైడర్ల మధ్య పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని మంత్రి ఆదేశించారు. ఆలయ పరిసరాలతో పాటు మొత్తం మేడారం ప్రాంతాన్ని పారిశుధ్య కార్మికుల ద్వారా నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, రహదారులపై చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనలను రక్షిస్తుందనే భావనతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ.. మేడారం అభివృద్ధి పనులన్నింటినీ నిర్దేశించిన గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సమ్మక్క–సారలమ్మ వనదేవతల దర్శనం, జిల్లా అభివృద్ధి పైలాన్ ప్రారంభోత్సవం, నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, జిల్లా అధికారులు, ఆలయ పూజారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






