రాజగోపాలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

by Taduka Kalyani |

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి రాజగోపాలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రాజగోపాలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
X

దిశ, నంగునూరు: సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి రాజగోపాలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రిలోని ఓపీ విభాగం, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు, రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాలను తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్య అధికారులను ఆదేశించారు. అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఉప ఆరోగ్య కేంద్రాల ద్వారా ఏఎన్‌ఎంలు, సూపర్‌ వైజర్లు గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో రోజువారీగా ఎంతమంది రోగులు ఓపీ సేవలు పొందుతున్నారని అడిగి తెలుసుకున్నారు., రోజుకు సుమారు 50 నుంచి 60 మంది రోగులు వస్తున్నట్లు వైద్యాధికారులు కలెక్టర్ కు తెలిపారు.

ఆసుపత్రి సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. అటెండెన్స్ రిజిస్టర్, లీవ్ లెటర్లు, ఓపీ రిజిస్టర్‌లను పరిశీలించారు. విధులకు అందరూ హాజరయ్యారని వైద్యాధికారి వివరించారు. వైద్య సిబ్బంది సమయ పాలన పాటిస్తూ రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రోగులకు అవసరమైన మందులు సకాలంలో అందించి వారికి ఆరోగ్య సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. చిన్న ఆరోగ్య సమస్యల నుంచి సీజనల్ వ్యాధుల వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్య సేవలు పొందాలని సూచించారు. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలని చెప్పారు. పోషకాహారం తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ముఖ్యంగా తాగునీటిని కాచి చల్లార్చి తాగడం అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సీజనల్ వ్యాధులను నియంత్రించడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సంప్రదించి వైద్య సేవలను పొందాలని విజ్ఞప్తి చేశారు.

Next Story