కిడ్నీ వ్యాధి స్టేజ్-2 : ముందస్తు లక్షణాలను గుర్తించడం ఎలా?

by Javid Pasha |

స్టేజ్ 2 కిడ్నీ వ్యాధి అనేది మూత్ర పిండాలకు తేలికపాటి నష్టం జరిగిన దశ. జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకం కావచ్చు!

కిడ్నీ వ్యాధి స్టేజ్-2 : ముందస్తు లక్షణాలను గుర్తించడం ఎలా?
X

దిశ, ఫీచర్స్ : అనేకమందిని వేధిస్తు్న్న ఆరోగ్య సమస్యల్లో కిడ్నీల పనితీరు నెమ్మదించడం లేదా కిడ్నీల వైఫల్యం కూడా ఒకటి. అయితే చాలామంది ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, ముందస్తుగా గుర్తించకపోవడంవల్ల ఈ సమస్యల బారిన పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. స్టేజ్-1లో దీనికి సంబంధించిన లక్షణాలు పెద్దగా కనిపించవు. కాబట్టి రొటీన్ టెస్టుల ద్వారా మాత్రమే దీనిని గుర్తించడం సాధ్యం అవుతుంది. గుర్తించగానే తగిన చికిత్స ద్వారా బయటపడవచ్చు. కానీ స్టేజ్ 2 క్రానిక్ కిడ్నీ డిసీజ్ అలా కాదు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మూత్ర పిండాలకు తేలికపాటి నష్టం జరిగిన దశ కాబట్టి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు, చికిత్సలు అవసరం? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏం జరుగుతుంది?

స్టేజ్ 2 కిడ్నీ వ్యాధి అనేది మూత్ర పిండాలకు తేలికపాటి నష్టం జరిగిన దశ. ఈ దశలో ఎస్టిమేటెడ్ గ్లోమెర్యులర్ ఫిల్ట్రేషన్ రేట్ (eGFR) 60-89 మధ్య ఉంటుంది. చాలా మందికి లక్షణాలు బయటకు స్పష్టంగా కనిపించవు కాబట్టి నిర్ధారణ కొంచెం కష్టంమే అంటున్నారు నిపుణులు. అలాంటప్పుడు రక్త పరీక్షలు (క్రియాటినిన్, eGFR), యూరిన్ టెస్టులు, అల్ట్రాసౌండ్ ద్వారా దీనిని గుర్తించవచ్చునని చెబుతున్నారు.

లక్షణాలు

యూరిన్ డార్క్ రంగులో రావడం, మూత్ర విసర్జనలో మార్పులు, అలసట, హై బ్లడ్ ప్రెజర్, శరీరంలో నీటి నిలకడ (ఎడీమా), వీపు భాగంలో తరచుగా నొప్పి, కండరాలపై పగుళ్లు, నిద్రలేమి, చర్మం పొడిబారడం లేదా దురద వంటివి కొంతమందిలో కనిపిస్తాయి. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ స్టోన్స్, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వంటివి ఇందుకు ప్రధాన కారణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నివారణ & చికిత్స

రెండవదశ కిడ్నీ వ్యాధిలో నష్టాన్ని పూర్తిగా తిరిగి మార్చలేం కానీ దాని పెరుగుదల లేదా ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని ఆపవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగాహెల్తీ ఫుడ్స్ (తక్కువ సోడియం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించడం, తాజా కూరగాయలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్) తీసుకోవడం, వ్యాయామం, బరువు నియంత్రణ, ధూమపానం-మద్యపానం మానడం చాలా ముఖ్యం. ఇక డయాబెటిస్, బీపీ నియంత్రణకు మెడిసిన్(ACE ఇన్హిబిటర్స్, ARBs) వాడాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే.. ప్రమాదకరమైన స్టేజ్ 3కి వెళ్లకుండా నివారించవచ్చు. కాబట్టి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తు్న్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story