ఎల్ నినో భయం.. ట్రాక్టర్ల విక్రయాలపై తీవ్ర ప్రభావం!

by Prasad Jukanti |

ఎల్ నినో వల్ల వర్షపాతం తగ్గి ట్రాక్టర్ల విక్రయాలు మందగిస్తాయని, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందని జేఎమ్ ఫైనాన్షియల్ తెలిపింది.

ఎల్ నినో భయం.. ట్రాక్టర్ల విక్రయాలపై తీవ్ర ప్రభావం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఎన్ నినో పరిస్థితులు సర్వత్రా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ఆధారపడే వ్యాపారాలపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'జేఎమ్ ఫైనాన్షియల్' (JM Financial) తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. గత 25 ఏళ్ల కాలంలో భారతదేశ ఆర్థిక, వ్యవసాయ రంగాలకు సంబంధించిన 13 కీలక సూచీలను విశ్లేషించి రూపొందించిన ఈ నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు.

ట్రాక్టర్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం:

సాధారణంగా సమృద్ధిగా వర్షాలు కురిసే లా నినా కాలంతో పోలిస్తే, ఎల్ నినో సంవత్సరాల్లో వర్షపాతం తగ్గడం, ఖరీఫ్ సాగు విస్తీర్ణం, ఆహార ఉత్పత్తి పడిపోవడం, ఆహార ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఎల్ నినో పరిస్థితుల వల్ల అత్యంత వేగంగా ప్రభావితమయ్యేది ట్రాక్టర్ల విక్రయాలేనని అంచనా వేసింది. లా నినా కాలంలో 10.7 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిన ట్రాక్టర్ల అమ్మకాలు, ఎల్ నినో ఏర్పడినప్పుడు మాత్రం కేవలం 3.5 శాతానికి పరిమితమయ్యాయి. ట్రాక్టర్ల అమ్మకాలు మందగించినప్పటికీ, ద్విచక్ర వాహనాలు, ఎఫ్‌ఎమ్‌సీజీ (FMCG) రంగాలు మాత్రం ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగాయని నివేదిక పేర్కొంది.

వ్యవసాయం, ఆర్థిక రంగంపై పడే ప్రభావాలు ఇవే:

జేఎమ్ ఫైనాన్షియల్ విశ్లేషించిన పారామీటర్లలో ఎల్ నినో కాలంలో వర్షపాతంలో సగటున -10.65 మేర లోటు నమోదుకానుంది. అలాగే ఖరీఫ్ సాగు విస్తీర్ణం 1 శాతం తగ్గగా, ఆహార ఉత్పత్తి వార్షిక ప్రాతిపదికన 4 శాతం మేర క్షీణించనుంది. వర్షాలు లేక దిగుబడి తగ్గడంతో ఆహార ద్రవ్యోల్బణంలో సగటున 60 బేసిస్ పాయింట్ల (bps) మేర పెరుగుదల కనిపించనున్నట్లు తెలిపింది. వాతావరణంలో వచ్చే ఇటువంటి మార్పుల వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఫలితంగా ఈ కాలంలో ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చే రుణాల రేటు (Credit offtake) గణనీయంగా తగ్గుతోందని నివేదిక వివరించింది. భారతదేశ గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై అత్యంత లోతైన ప్రభావాన్ని చూపుతున్నాయని పరిశోధనా సంస్థ స్పష్టం చేసింది.

Next Story