రాజధానిలో జగన్నాథ రథయాత్ర.. పాల్గొన్న సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

రోజువారీ జీవితంలో ఒత్తిడి తగ్గించే అత్యుత్తమ మంత్రం ఆధ్యాత్మికత ఒక్కటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమాజాన్ని ప్రశాంతంగా ఉంచే క్షేత్రాలు మన దేవాలయాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు...

రాజధానిలో జగన్నాథ రథయాత్ర.. పాల్గొన్న సీఎం చంద్రబాబు
X

దిశ, ఏపీ బ్యూరో: రోజువారీ జీవితంలో ఒత్తిడి తగ్గించే అత్యుత్తమ మంత్రం ఆధ్యాత్మికత ఒక్కటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమాజాన్ని ప్రశాంతంగా ఉంచే క్షేత్రాలు మన దేవాలయాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజంలో మానవ సంబంధాలు తగ్గి సామాజిక మాధ్యమాల ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన అన్నారు. ఈ కారణంగా కొన్ని కుటుంబాల్లో ఆత్మహత్యలు, చిన్నారులపై అఘాయిత్యాల లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. అందరి జీవితాల్లో ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత చేకూరేందుకు ఆధ్యాత్మికతే మార్గమని ఆయన వివరించారు. అందుకే రాష్ట్రంలో 5 వేల శ్రీవారి ఆలయాలు నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.

అమరావతి రాజధానిలోని వెంకటపాలెం నుంచి ఆయన జగన్నాథుడి రథయాత్రను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పూరీ క్షేత్రంలో నిర్వహించే సంప్రదాయ క్రతువులను అనుసరిస్తూ జగన్నాథ, బలభద్ర, సుభద్రలతో కూడిన రథం ముందు సీఎం బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేసి స్వామివారి రథ యాత్రను తాడుతో లాగి ప్రారంభించారు. అమరావతి రాజధాని నగర బృహత్ ప్రణాళికతో కూడిన చిత్ర పటాన్ని శిరస్సుపై ధరించి విశ్వ నగరిగా అమరావతి ఎదగాలని ముఖ్యమంత్రి జగన్నాథ స్వామిని కోరుకున్నారు. అంతకు ముందు అక్కడే ఏర్పాటు చేసిన రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని సీఎం ప్రసంగించారు. భారతీయ సంస్కృతిలో భాగమైన ఉమ్మడి కుటుంబాలు రావాలని మైక్రో ఫ్యామిలీలు కాదని సీఎం అన్నారు. పూరీ క్షేత్రంలో నిర్వహించే జగన్నాథ రథ యాత్రకు ఎంతో ప్రత్యేకత ఉందని, అలాంటి రథ యాత్రను అమరావతిలో తొలిసారి నిర్వహించటంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ప్రతీ ఏటా జగన్నాథ రథ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇస్కాన్ సంస్థ ప్రకటించిందని అన్నారు. ఆధ్యాత్మికత, ప్రజా సేవలో ఇస్కాన్, అక్షయపాత్ర ఫౌండేషన్ లు పనిచేస్తున్నాయని తెలిపారు. దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 25 వేల పాఠశాలల్లో ఆహారం అందిస్తున్నాయన్నారు.

ఏపీలోని 10 సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా 1.80 లక్షల మంది విద్యార్ధులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ఆహారం అందిస్తోందన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడేందుకు ఇస్కాన్ లాంటి సంస్థలతో కలిసి పని చేస్తామన్నారు. జగన్నాథ రథ యాత్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పి.నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Next Story