- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుది దశలో అమరావతి నిర్మాణాలు
రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస టవర్లు, హెచ్‌వోడీ టవర్ల పనులు తుది దశకు చేరుకున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు....

దిశ, ఏపీ బ్యూరో: రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస టవర్లు, హెచ్‌వోడీ టవర్ల పనులు తుది దశకు చేరుకున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో కలిసి నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని, త్వరలోనే సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి భవనాలను అప్పగిస్తామని వెల్లడించారు. నిర్మాణ నాణ్యత, ఆధునిక సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలపై అధికారులు, ప్రజాప్రతినిధులకు వివరించారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అన్ని వసతులతో నివాసాలు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం అన్ని సౌకర్యాలతో నివాస సముదాయాలు సిద్ధమవడం సంతోషకరమన్నారు. త్వరలోనే ప్రజాప్రతినిధులు ఈ నివాసాల్లోకి ప్రవేశిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి నిర్మాణం ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
'అమరావతిపై జగన్‌కు స్థిరమైన వైఖరి లేదు'
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, అమరావతి విషయంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వైఖరి తరచూ మారుతోందని విమర్శించారు. ఒకసారి అమరావతి, మరోసారి మూడు రాజధానులు, ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదన అంటూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. అయిదేళ్ల పాలనలో రాజధాని అభివృద్ధికి ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించారు.
ప్రపంచ స్థాయి సచివాలయ సముదాయం
అమరావతిలో సుమారు 16 వేల మంది అధికారులు, ఉద్యోగులు ఒకేచోట పనిచేసేలా ఐదు ఐకానిక్ సచివాలయ టవర్లు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. 204 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సచివాలయ భవనంగా ఇది నిలవనున్నట్లు చెప్పారు. దేశంలోనే తొలిసారిగా సచివాలయం, హెచ్‌వోడీ టవర్లు ఒకేచోట నిర్మిస్తున్నామని, డయాగ్రిడ్ సాంకేతికతతో లోపల పిల్లర్లు లేకుండా, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా భవనాలు రూపొందిస్తున్నామని వివరించారు.
నివాస టవర్ల పనులు 90–95 శాతం పూర్తి
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 12 టవర్లలో 276 ఫ్లాట్ల నిర్మాణం 90 శాతం పూర్తయిందని, అఖిల భారత సర్వీసు అధికారుల కోసం ఆరు టవర్లలో 138 ఫ్లాట్ల పనులు 95 శాతం పూర్తయ్యాయని మంత్రి నిమ్మల తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రజా రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
సీడ్ యాక్సెస్ రోడ్డుకు 99.5 శాతం భూ సమీకరణ
సీడ్ యాక్సెస్ రోడ్డుకు అవసరమైన 45.47 ఎకరాల్లో 99.5 శాతం భూమిని రైతుల నుంచి సమీకరించినట్లు నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇంకా కేవలం 1.52 ఎకరాల భూమి మాత్రమే సమీకరించాల్సి ఉందని, ఒకరు లేదా ఇద్దరు రైతులు రాజకీయ కారణాలతో భూములు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. రైతుల సహకారంతో రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.






