- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అలాంటి అత్తమామలు దొరకడం నా అదృష్టం’.. కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి సూసైడ్ నోట్!
సాధారణంగా అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు ఎక్కువగా వింటుంటాం. కానీ, దానికి భిన్నంగా తన అత్తమామలు తనను చాలా బాగా చూసుకున్నారని, అలాంటి కుటుంబం దొరకడం తన అదృష్టమని పేర్కొంటూ ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు ఎక్కువగా వింటుంటాం. కానీ, దానికి భిన్నంగా తన అత్తమామలు తనను చాలా బాగా చూసుకున్నారని, అలాంటి కుటుంబం దొరకడం తన అదృష్టమని పేర్కొంటూ ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. తీవ్రమైన వెన్నెముక వ్యాధితో బాధపడుతున్న 28 ఏళ్ల నిక్కీ అలియాస్ వైష్ణవి, తన చావుకు ఎవరూ కారణం కాదని తెలుపుతూ ఉద్వేగభరితమైన లేఖ రాసి తనువు చాలించింది. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. నిక్కీకి మూడేళ్ల క్రితం శివమ్ శుక్లాతో వివాహమైంది. వీరికి ఒక చిన్న బాబు ఉన్నాడు. శివమ్ మధ్యప్రదేశ్‌లో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నిక్కీ కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతూ, కాన్పూర్, ఢిల్లీలలో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ చికిత్స తీసుకుంటోంది. అయితే, వ్యాధి నయం కాకపోవడంతో భవిష్యత్తుపై ఆందోళన చెంది, తీవ్ర నిరాశకు గురైన ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్..
మరణానికి ముందు నిక్కీ రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ‘ఇలాంటి అత్తగారి ఇల్లు దొరకడం నిజంగా నా అదృష్టం. ఇక్కడ ప్రతి ఒక్కరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. దయచేసి నా కోసం ఎవరూ బాధపడకండి. జీవితాంతం మీతోనే ఉంటానన్న నా మాటను నిలబెట్టుకోలేకపోతున్నాను. నా అనారోగ్యం వల్లే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ అడుగు వేస్తున్నాను.’ తన వస్తువుల గురించి కూడా ఆమె లేఖలో స్పష్టమైన సూచనలు చేసింది. తన తండ్రి కొనిచ్చిన నగలు, తన స్కూటర్‌ను తన మరిదికి (భర్త తమ్ముడు) కాబోయే భార్యకు బహుమతిగా ఇవ్వాలని కోరింది. అలాగే తన అత్తయ్య ఫోన్ పాతబడిపోయినందున, తన మొబైల్ ఫోన్‌ను ఆమెకు ఇవ్వాలని సూచించింది.
ఉద్యోగం రాదనే బెంగతో..
నిక్కీ ఇటీవల ఢిల్లీ పోలీస్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి తదుపరి దశకు సిద్ధమవుతోంది. అయితే, తన వెన్నెముక సమస్య కారణంగా తాను ఫిజికల్ టెస్టులలో అర్హత సాధించలేనేమోనన్న తీవ్ర ఆందోళన ఆమెను వేధించినట్లు బంధువులు తెలిపారు. ఆమె చికిత్స కోసం కుటుంబ సభ్యులు అన్ని విధాలా ప్రయత్నాలు చేశారని వారు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న రావత్‌పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. భార్య మరణంతో భర్త శివమ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఘటనపై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) దిలీప్ సింగ్ మాట్లాడుతూ.. యువతి తన అనారోగ్యం పట్ల తీవ్ర మనోవేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోందన్నారు. యువతి పుట్టింటి వారు కానీ, అత్తింటి వారు కానీ ఒకరిపై ఒకరు ఎలాంటి ఆరోపణలు చేసుకోలేదని స్పష్టం చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.






