నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

by Ratna Kumari |

మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తార్నాకలోని ఎంఎంసీ ప్రధాన కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటీ విభాగం చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో గ్రీన్ కవర్ విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కమ్యూనిటీలు, బహిరంగ ప్రదేశాల్లో విస్తృత స్థాయిలో మొక్కలు నాటాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రతి 2 బీహెచ్‌కే కాలనీలో ప్రత్యేకంగా ‘వన్ డే ప్లాంటేషన్ డ్రైవ్’ నిర్వహించాలని, అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కల నిర్వహణను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి ప్రాంతంలో నాటిన మొక్కల సంఖ్య, వాటి మనుగడపై ప్రత్యేక రికార్డులు నిర్వహించడంతో పాటు జియో ట్యాగింగ్ చేపట్టాలని సూచించారు. అదేవిధంగా ప్రతి వీధిలోని ప్లాంటర్ బాక్స్‌లను సమగ్రంగా అభివృద్ధి చేయాలని, మొక్కలు నాటకుండా ఖాళీగా ఉన్న ప్లాంటర్ బాక్స్‌లను గుర్తించి టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారంతో తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు. కాంపౌండ్‌లలోని టాట్‌లాట్ (Tot Lot) ప్రాంతాల్లో కనీసం 10 శాతం హరిత విస్తీర్ణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులు పూర్తయిన మేరకే బిల్లుల చెల్లింపులు జరుగుతాయని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అర్బన్ బయోడైవర్సిటీ డైరెక్టర్ సునంద, డిప్యూటీ డైరెక్టర్లు అన్నపూర్ణ, శ్రీధర్, సర్కిల్ మేనేజర్లు, సూపరింటెండెంట్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Next Story