కూకట్‌పల్లిలో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

by Ratna Kumari |

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తరగతి చదువుతున్న ఓ 14 ఏళ్ల విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

కూకట్‌పల్లిలో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, కూకట్‌పల్లి : కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తరగతి చదువుతున్న ఓ 14 ఏళ్ల విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట్‌లోని ఎస్‌ఎం మోడల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని గురువారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన సమయంలో ఆమె పాఠశాలలో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయుడు నరేష్‌తో వీడియో కాల్‌లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా, విద్యార్థిని కొంతకాలంగా ఉపాధ్యాయుడితో వాట్సాప్‌లో చాటింగ్ చేసినట్లు, గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఖాతా తెరిచి అక్కడ కూడా సందేశాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. వీడియో కాల్ సందర్భంగా విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా విద్యార్థిని ఉరివేసుకుని కనిపించినట్లు సమాచారం.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. విద్యార్థిని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఉపాధ్యాయుడితో చాటింగ్ ఉన్నట్లు గుర్తించారు. అయితే వాట్సాప్ చాటింగ్‌కు సెక్యూరిటీ పాస్‌వర్డ్ ఉండటంతో డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఉపాధ్యాయుడితో ఉన్న సంబంధమే తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు నరేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు దారితీసిన అసలు కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story