రోగులకు మరింత పరిశుభ్రమైన వాతావరణం.. నిమ్స్‌లో కొత్త హౌస్‌కీపింగ్ సేవలు

by Ramesh Naini |

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో పరిశుభ్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు.

రోగులకు మరింత పరిశుభ్రమైన వాతావరణం.. నిమ్స్‌లో కొత్త హౌస్‌కీపింగ్ సేవలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో పరిశుభ్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. అత్యాధునిక మెకనైజ్డ్ క్లీనింగ్ వ్యవస్థల వినియోగంతో రోగులు, వారి సహాయకులు, వైద్యులు, సిబ్బందికి మరింత సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఈ సేవలు ఎంతో దోహదపడతాయని, నాణ్యమైన సేవలందించే దిశగా నిమ్స్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిమ్స్ ఆవరణలో గురువారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని, క్వాలిటీ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (క్యూపీఎంఎస్) ఆధ్వర్యంలో చేపట్టనున్న హౌస్‌కీపింగ్, మెకనైజ్డ్ క్లీనింగ్ సేవలను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్యూపీఎంఎస్ సంస్థ ఆసుపత్రి ప్రాంగణాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు వీలుగా అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫ్లోర్ స్క్రబ్బింగ్ మెషీన్లు, వాక్-బిహైండ్ స్క్రబ్బర్లు, హై-ప్రెజర్ జెట్ మెషీన్లు, వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్లు తదితర ఆధునిక యంత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ పరంజ్యోతి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, పరిపాలన విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ లక్ష్మీ భాస్కర్, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సల్మాన్, మీడియా రిలేషన్స్ ఆఫీసర్ సత్య గౌడ్, క్యూపీఎంఎస్ సంస్థ ఏపీ, తెలంగాణ ప్రాజెక్ట్ హెడ్ మనీష్ కుమార్, ప్రతినిధులు విద్యాసాగర్, సూపర్వైజర్లు రాము, రవి తదితరులు పాల్గొన్నారు.

Next Story