- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలు, మూగజీవాల ప్రాణాలకు ముప్పు
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజలు, మూగజీవాల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తిమ్మాపూర్ : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజలు, మూగజీవాల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో విద్యుత్ తీగలు అత్యంత ప్రమాదకరంగా కిందకు వేలాడుతూ ఉండటంతో వాటి బారిన రైతులు, ప్రజలు, పశువులు పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో బుధవారం, గురువారం చోటుచేసుకున్న రెండు ఘటనలు స్థానికంగా ఆందోళన కలిగించాయి.
విద్యుత్ తీగ తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు..
మన్నెంపెల్లి గ్రామానికి చెందిన మానుపాటి రమేష్ పోరండ్ల శివారులోని కొత్తకుంట ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లగా, కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగ అతని తలకు తగిలింది. ఈ ఘటనలో రమేష్ తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు ఎల్ఎండీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విద్యుత్ షాక్‌తో మూర్రా గేదె మృతి..
అదే గ్రామానికి చెందిన రైతు చింతల రమణారెడ్డి పాలిచ్చే మూర్రా జాతి గేదె విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. గురువారం రైతు తన వ్యవసాయ పొలాల సమీపంలో గేదెలను మేపుతుండగా, సమీపంలోని 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద గేదె మేస్తున్న సమయంలో ఫేజ్ వైర్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత రైతుకు సుమారు రూ.1.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని గ్రామస్తులు పేర్కొన్నారు. నష్టపోయిన రైతుకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వారు కోరారు.
ప్రమాదకరంగా మారిన వేలాడుతున్న విద్యుత్ తీగలు..
గ్రామాల్లో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే మరమ్మతు చేయాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






