- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోజుకో కొత్త ఎత్తుగడ.. లారీ క్యాబిన్‌లో కోట్ల విలువైన గంజాయి తరలింపు
దొంగ రవాణాకు కేటుగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. లారీ కొనుక్కోవాలన్న ఒక సాధారణ డ్రైవర్ కోరికను బడా డ్రగ్ పెడ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. లారీ కొనేందుకు ఆర్థిక సాయం చేసి, అందులోనే వందల కిలోల గంజాయిని రవాణా చేయించారు...

దిశ,తెలంగాణ బ్యూరో: దొంగ రవాణాకు కేటుగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. లారీ కొనుక్కోవాలన్న ఒక సాధారణ డ్రైవర్ కోరికను బడా డ్రగ్ పెడ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. లారీ కొనేందుకు ఆర్థిక సాయం చేసి, అందులోనే వందల కిలోల గంజాయిని రవాణా చేయించారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గుట్టుచప్పుడు కాకుండా కంటైనర్ లారీలో తరలిస్తున్న భారీ గంజాయిని తెలంగాణ ఈగిల్ ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. విజయవాడ ముంబై జాతీయ రహదారిపై వైఎన్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో తనిఖీలు నిర్వహించి, డ్రైవర్ క్యాబిన్‌లో రహస్యంగా దాచిన రూ.1.18 కోట్ల విలువైన 237 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
ఈగల్ ఫోర్స్ అధికారులు తెలిపిన వివారల ప్రకారం.. బిహార్‌కు చెందిన రాజేష్ కుమార్ 33 నవీ ముంబైకి వలస వెళ్లి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి మహారాష్ట్రలోని పుణెకు చెందిన డ్రగ్ పెడ్లర్లు సురేష్, ధరమ్ షిండేలతో పరిచయం ఏర్పడింది. లారీ కొనేందుకు రూ.3 లక్షలు ఇస్తామని, ప్రతిఫలంగా గంజాయి రవాణా చేయాలని వారు షరతు పెట్టారు. అందుకు రాజేష్ అంగీకరించడంతో వారు ఇచ్చిన డబ్బుతో సెకండ్ హ్యాండ్ కంటైనర్ లారీని కొన్నాడు. ప్లాన్ ప్రకారం జులై 7న పెడ్లర్లు కమీషన్, ప్రయాణ ఖర్చుల కింద రాజేష్‌కు రూ.1.50 లక్షలు ఇచ్చారు. ఏపీలోని విజయవాడలో ఉన్న సప్లయర్ పీతాంబర్ సబర్‌ను కలవాలని అతడిని పురమాయించారు. రాజేష్‌కు తోడుగా పుణెకే చెందిన అనిల్ రంగనాథ్ 35 అనే కూలీని కూడా వెంట పంపించారు.
జులై 11న పైపుల లోడ్‌తో విజయవాడకు చేరుకుని, ఆ తర్వాత పీతాంబర్‌తో కలిసి ఒడిశా వెళ్లారు. అక్కడ సరుకు లేకపోవడంతో పీతాంబర్ సూచన మేరకు విశాఖపట్నం వచ్చి రెండు రోజులు ఆగారు. జులై 14 రాత్రి పీతాంబర్ 10 సంచుల్లో 237 కిలోల గంజాయిని తీసుకొచ్చి వారికి అప్పగించాడు. ఆ సరుకును లారీ క్యాబిన్‌లో దాచుకుని హైదరాబాద్ మీదుగా పుణెకు బయలుదేరగా పోలీసులకు చిక్కారు. మొదట తాము విశాఖపట్నమే వెళ్లామని నిందితులు బుకాయించినా, మొబైల్ కాల్ డేటా ద్వారా వారు ఒడిశా వెళ్లినట్లు ఆధారాలతో నిర్ధారించి రాచకొండ నార్కోటిక్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఇద్దరిని రిమాండ్‌కు తరలించి, పరారీలో ఉన్న పుణె పెడ్లర్లు, ఒడిశా సప్లయర్ కోసం గాలిస్తున్నారు.
ప్రజల సహకారంతోనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యం.. ఈగిల్ ఫోర్స్..
అంతర్రాష్ట్ర గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతూ రెండు నెలల్లోనే 1500 కిలోలు పట్టుకున్నామని, యువత మత్తుబారిన పడుతున్నందున తల్లిదండ్రులు వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, మాదకద్రవ్యాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలుపాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని, డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనకు ప్రతి ఒక్క పౌరుడు సామాజిక బాధ్యతగా సహకరించాలని, ఈ మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రజల సహకారంతోనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని ఈగిల్ ఫోర్స్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.






