గౌడ సంఘం అనుమతి లేకుండా తాటి చెట్ల నరికివేత..!

by Taduka Kalyani |   (  Updated:2026-07-16 15:38:53  IST  )

గౌడ సంఘం అనుమతి లేకుండా తాటి చెట్లను నరికివేయడం వల్ల గీత కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడిందని కొంగరకలాన్ గౌడ సంఘం అధ్యక్షుడు తాళ్ల సురేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

గౌడ సంఘం అనుమతి లేకుండా  తాటి చెట్ల నరికివేత..!
X

ఇబ్రహీంపట్నం: గౌడ సంఘం అనుమతి లేకుండా విచక్షణారహితంగా తాటి చెట్లను నరికివేయడం వల్ల గీత కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడిందని కొంగరకలాన్ గౌడ సంఘం అధ్యక్షుడు తాళ్ల సురేష్ గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంగరకలాన్ గ్రామం ఫీరోజ్‌గూడ సర్వే నంబర్లు 85, 86, 87లలో ఏఆర్‌కే (ARK) వెంచర్స్ పేరుతో అభివృద్ధి చేస్తున్న ప్రైవేట్ వెంచర్‌లో గౌడ సంఘానికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే సుమారు 50 తాటి చెట్లను నరికివేశారని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. గత జనవరి నెల నుంచి సదరు వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి గీత కార్మికులు సహా ఎవరినీ లోపలికి అనుమతించడం లేదని మండిపడ్డారు. తాటి చెట్లపై ఆధారపడి కల్లు గీయడం, తాటి ముంజలు విక్రయించడం ద్వారా జీవనం సాగిస్తున్న గౌడ కుటుంబాల ఉపాధిని పూర్తిగా దెబ్బతీసేలా ఈ చర్యలు ఉన్నాయని దుయ్యబట్టారు. తాటి చెట్లు గౌడల సాంప్రదాయ వృత్తికి జీవనాధారమని, వాటిని తొలగించడం వల్ల వందలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు.

అధికారుల మౌనంపై అనుమానాలు..

గతంలో ఒకటి లేదా రెండు తాటి చెట్లను తొలగించాలన్నా ఎక్సైజ్ శాఖ, గౌడ సొసైటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు చెప్పేవారని.. కానీ ఇప్పుడు ఒకేసారి దాదాపు 50 తాటి చెట్లను నరికివేసినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. గౌడ సంఘానికి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా వెల్లడించకుండా చెట్లను తొలగించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చెట్ల నరికివేతను నిలిపివేయాలని, ఇప్పటికే తొలగించిన చెట్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ఉపాధ్యక్షులు నీళ్ల ధనరాజ్ గౌడ్, జనరల్ సెక్రటరీ ఉడుతల అరవింద్ గౌడ్, డైరెక్టర్లు చింతాకుల శ్రీనివాస్ గౌడ్, నాయిని బాలరాజ్ గౌడ్, నీళ్ల రమేష్ గౌడ్, ఉడుతల ప్రేమ్ కుమార్ గౌడ్, నీళ్ల హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Next Story