తెలంగాణ వ్యవసాయ శాఖకు అరుదైన ఘనత.. రాజేంద్రనగర్ ఎఫ్‌సీఓ ల్యాబ్‌కు అంతర్జాతీయ గుర్తింపు

by Ramesh Naini |

రాష్ట్ర వ్యవసాయ శాఖ మరో ప్రతిష్టాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. రాజేంద్రనగర్‌లోని ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు (ఎఫ్సీవో) ప్రయోగశాలకు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తింపు లభించింది.

తెలంగాణ వ్యవసాయ శాఖకు అరుదైన ఘనత.. రాజేంద్రనగర్ ఎఫ్‌సీఓ ల్యాబ్‌కు అంతర్జాతీయ గుర్తింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యవసాయ శాఖ మరో ప్రతిష్టాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. రాజేంద్రనగర్‌లోని ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు (ఎఫ్సీవో) ప్రయోగశాలకు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తింపు లభించింది. ఈ గుర్తింపుతో ఈ ప్రయోగశాల అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తోందని అధికారికంగా ధృవీకరించారు. ఫలితంగా రైతులకు అందే ఎరువుల నాణ్యత పరీక్షలు ఇకపై మరింత ఖచ్చితత్వంతో సాగనున్నాయి. రాజేంద్రనగర్ ఎఫ్‌సీఓ ప్రయోగశాల ప్రమాణాలను విజయవంతంగా అమలు చేసి, ఎరువుల రసాయన విశ్లేషణలో అంతర్జాతీయ సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించుకుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న మొత్తం 9 నాణ్యత నియంత్రణ ప్రయోగశాలల్లో (ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు) ఎన్ఏబీఎల్ గుర్తింపు సాధించిన మొదటి ప్రయోగశాల ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ కేంద్రంలో మ్యూరియేట్ ఆఫ్ పొటాష్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ (ఎస్ఎస్ ఫీ– పౌడర్, గ్రాన్యులర్) ఎరువుల నాణ్యత పరీక్షలకు ఈ గుర్తింపు లభించింది.

వ్యవసాయ శాఖకు పెద్ద మైలురాయి

ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు పత్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, డైరెక్టర్ డాక్టర్ బి. గోపి, ఇతర ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ అంతర్జాతీయ గుర్తింపు తెలంగాణ ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు పెద్ద మైలురాయిగా నిలిచింది. ఇది రాష్ట్రంలో నాణ్యత నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కాకుండా, మార్కెట్లో లభించే ఎరువుల నాణ్యతపై రైతుల్లో నమ్మకాన్ని రెట్టింపు చేయనుంది. రాబోయే రోజుల్లో అన్ని ల్యాబ్‌లను అంతర్జాతీయ స్థాయికి చేర్చి రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటామని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

మిగిలిన ల్యాబ్‌లకూ గుర్తింపు తెస్తాం: మంత్రి

‘రాజేంద్రనగర్ ఎఫ్‌సీఓ ల్యాబ్‌కు అంతర్జాతీయ గుర్తింపు రావడం రాష్ట్ర వ్యవసాయ శాఖకు గర్వకారణం. రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇదే తరహాలో రాష్ట్రంలోని మిగిలిన అన్ని వ్యవసాయ నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలకు కూడా దశలవారీగా గుర్తింపు వచ్చేలా చర్యలు వేగవంతం చేయాలి.’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Next Story