- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ అమలు చేయాలి
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ వానాకాలంలో అత్యవసర ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ ప్రణాళికను వెంటనే అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

దిశ, మహబూబ్‌నగర్ ప్రతినిధి : ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ వానాకాలంలో అత్యవసర ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ ప్రణాళికను వెంటనే అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవని నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై రైతులకు మార్గనిర్దేశం చేయాలని చెప్పారు.
వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో వరి సాగుపై మాత్రమే ఆధారపడకుండా తక్కువ నీటితో సాగయ్యే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల పంటలను ప్రోత్సహించాలని సూచించారు. పంటల మార్పిడి ద్వారా రైతులకు ఆర్థిక లాభం కలగడంతో పాటు భూసార పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కోయిల్‌సాగర్ రిజర్వాయర్‌లోని నీటి నిల్వలను సమీక్షించిన కలెక్టర్, అందుబాటులో ఉన్న సాగునీటికి అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో ఎంపిక చేసిన మండలాలను సందర్శించి రైతులతో సమావేశం కానున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు తక్కువ వ్యవధిలో, తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే కరువు తట్టుకునే పంటలైన జొన్న, సజ్జ, రాగి, ఆముదం, కంది, మొక్కజొన్న, నల్ల మినుములు, నువ్వులు, ఉలవలు, అలసందతో పాటు కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. అనంతరం వ్యవసాయ శాఖ రూపొందించిన రైతుల సూచనల కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి..
జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన గడువులను పొడిగించిందని తెలిపారు. బీఎల్‌ఓల ఇంటింటి సర్వే గడువును జూలై 24 నుంచి ఆగస్టు 3 వరకు, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా ఆగస్టు 3 వరకు పొడిగించినట్లు వెల్లడించారు.
1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైతే సమీప ప్రభుత్వ భవనాల్లో అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు రాజకీయ పార్టీలతో చర్చించి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణను ఆగస్టు 10న చేపడతారని, క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు కొనసాగుతుందని తెలిపారు. వాటి పరిష్కారం అక్టోబర్ 8 నాటికి పూర్తిచేసి అక్టోబర్ 12న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వివరించారు.
జిల్లాలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకు 57.05 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు పట్టణ ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌పై అవగాహన మరింత పెంచాల్సిన అవసరం ఉందని సూచించగా, మున్సిపల్ చెత్త సేకరణ వాహనాల ద్వారా ఆడియో ప్రచారం నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, జేఎల్‌బీ హరిప్రియ, ఆర్డీఓ నవీన్, జిల్లా ఎన్నికల డీటీ జాఫర్, ఈఆర్‌వోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






