సీఎం సాయం కోసం ఎదురుచూస్తున్న తలసీమియా బాధిత చిన్నారి ప్రసన్న

by Ratna Kumari |

మద్దూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన హనుమంతు–అనిత దంపతుల రెండో కుమార్తె ప్రసన్న గత ఐదేళ్లుగా తలసీమియా వ్యాధితో పోరాడుతోంది.

సీఎం సాయం కోసం ఎదురుచూస్తున్న తలసీమియా బాధిత చిన్నారి ప్రసన్న
X

దిశ, మద్దూరు : నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన హనుమంతు–అనిత దంపతుల రెండో కుమార్తె ప్రసన్న గత ఐదేళ్లుగా తలసీమియా వ్యాధితో పోరాడుతోంది. మూడు నెలల వయసులోనే చిన్నారికి తలసీమియా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించగా, అప్పటి నుంచి ప్రతి నెల రక్త మార్పిడి చేయిస్తూ తల్లిదండ్రులు ప్రాణాపాయ స్థితిలో ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్నారి పూర్తిగా కోలుకోవాలంటే అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని, అందుకు రూ.37.30 లక్షలు అవసరమని వైద్యులు సూచించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమకు అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చే స్థోమత లేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల రక్త మార్పిడి చేయించకపోతే చిన్నారి ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరించడంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

విషయం తెలుసుకున్న పలువురు దాతలు ఇప్పటివరకు సుమారు రూ.5 లక్షల మేర ఆర్థిక సహాయం అందించారు. తాజాగా మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని రెనివట్ల గ్రామానికి చెందిన బంగారు నారాయణ రూ.60 వేల ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. అయితే శస్త్రచికిత్సకు ఇంకా భారీ మొత్తంలో నిధులు అవసరమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, దాతలు స్పందించి తమ కుమార్తెకు ప్రాణదానం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి లేదా ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించి చికిత్స చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు. సకాలంలో శస్త్రచికిత్స జరిగితే ప్రసన్నకు కొత్త జీవితం లభించే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం, సేవాభావం కలిగిన దాతలు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story