అక్రమ వ్యర్థాల పారబోతపై కమిషనర్ ఉక్కుపాదం

by Ratna Kumari |

నగరంలో అక్రమంగా పారబోస్తున్న నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలపై మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఉక్కుపాదం మోపారు.

అక్రమ వ్యర్థాల పారబోతపై కమిషనర్ ఉక్కుపాదం
X

దిశ, మేడ్చల్ బ్యూరో : నగరంలో అక్రమంగా పారబోస్తున్న నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలపై మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఉక్కుపాదం మోపారు. పరిశుభ్రమైన నగర నిర్మాణమే లక్ష్యంగా గురువారం బేగంపేట–ప్రకాశ్‌నగర్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారుల పక్కన అక్రమంగా పారబోసిన నిర్మాణ వ్యర్థాలను పరిశీలించిన కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాల తరలింపును అధీకృత సంస్థలకు కాకుండా అనధికార వాహనాలకు అప్పగిస్తున్న బిల్డర్ల తీరును తప్పుబట్టారు. సంబంధిత వాహనాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమ డంపింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు మౌలాలి–అమ్ముగూడ ప్రాంతాల్లో నిరంతర సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, సంబంధిత వాహనాలను ఎలాంటి మినహాయింపు లేకుండా జప్తు చేస్తామని హెచ్చరించారు. నగరంలోని హోటళ్లు, వాణిజ్య సంస్థల నిర్వాహకులు తమ ఆహార వ్యర్థాలను కేవలం అధీకృత ప్రాసెసింగ్ కేంద్రాలకే అప్పగించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు పారబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్ని వాణిజ్య సంస్థలు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్‌ను ప్రదర్శించాలని, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించి పాదచారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సురక్షితమైన, పరిశుభ్రమైన, బాధ్యతాయుతమైన నగర నిర్మాణంలో ప్రజలు, వ్యాపారులు భాగస్వాములు కావాలని కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story