నాచారం చెరువు అభివృద్ధి ప‌నులు ప్రారంభం

by Vemula.Srinu Prasad |

ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని నాచారం పెద్ద చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌కు హైడ్రా శ్రీ‌కారం చుట్టింది. 108.30 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు అభివృద్ధి ప‌నుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ గురువారం ప్రారంభించారు. ..

నాచారం చెరువు అభివృద్ధి ప‌నులు ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని నాచారం పెద్ద చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌కు హైడ్రా శ్రీ‌కారం చుట్టింది. 108.30 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు అభివృద్ధి ప‌నుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ గురువారం ప్రారంభించారు. విశాల‌మైన క‌ట్ట నిర్మాణంతో పాటు.. పాత్ వేను నిర్మిస్తున్నారు. అన్ని వ‌య‌సుల వారు సేద దీరే విధంగా చెరువు క‌ట్ట‌పై కూర్చునేందుకు వెసులుబాటు క‌ల్పిస్తున్నారు. చెరువు చెంత ప్లే ఏరియాలు, పార్కులు అందుబాటులోకి వ‌స్తున్నాయి. పిల్ల‌ల ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్‌లు, యోగా చేసుకునేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్‌ల‌ను నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 28 కోట్ల‌తో ఈ చెరువును అభివృద్ధి చేస్తున్నారు. చెరువులో 10 ఫీట్ల మేర పూడిక‌ను తొల‌గిస్తున్నామ‌ని.. 9 నెల‌ల్లో ఈ చెరువు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌స్తుంద‌ని విలేక‌రులతో మాట్లాడుతూ చెప్పారు. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వ‌ద్ద వ‌ర్షాకాలం వ‌ర‌ద క‌ష్టాలు తొల‌గ‌డ‌మే కాకుండా.. భూగ‌ర్భ జ‌లాలు కూడా వృద్ధి చెందిన‌ట్టు తేలింద‌న్నారు. నాచారం చెరువులో ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డం జ‌రుగుతోంద‌ని.. ఇక్క‌డ కూడా భూగ‌ర్భ జ‌లాలు పెరుగుతాయ‌న్నారు. అంతే కాకుండా.. మురుగు నీరు, దుర్గంధం, దోమ‌ల‌తో ఇక్క‌డి నివాసితులు ఇబ్బందులు ప‌డేవార‌ని.. చెరువు పున‌రుద్ధ‌ర‌ణతో ఈ స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కార‌మౌతాయ‌న్నారు. చెరువు అభివృద్ధితో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంటుంద‌న్నారు.

నాగిరెడ్డికుంటనూ అభివృద్ధి చేస్తాం..

మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా యాప్రాల్‌లోని నాగిరెడ్డి కుంట అభివృద్ధిని కూడా హైడ్రా చేప‌డుతుంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ చెప్పారు. ఈ చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతున్నాయ‌ని అలాగే ప‌క్క‌నే ఉన్న ప్ర‌భుత్వ భూమిని కూడా కొంత‌మంది క‌బ్జా చేస్తున్నార‌ని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ గురువారం క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. నాగిరెడ్డి కుంట నుంచి ఊర చెరువుకు వెళ్లే వ‌ర‌ద కాలువ‌ను డైవ‌ర్ట్ చేయ‌డంతో వ‌ర‌ద‌లు సంభ‌విస్తున్నాయ‌ని.. ఈ రెండు చెరువుల మ‌ధ్య ఉన్న నివాస ప్రాంతాల‌తో పాటు.. ఎగువున ఉన్న ప్రాంతాలు కూడా నీట మునుగుతున్నాయ‌ని స్థానికులు హైడ్రా క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. నాలాను డైవ‌ర్ట్ చేయ‌డ‌మే కాకుండా.. ఆక్ర‌మ‌ణ‌ల‌తో వెడ‌ల్పు కూడా త‌గ్గ‌డంతో ఈ ఇబ్బంది త‌లెత్తుతోంద‌ని వాపోయారు. వెంట‌నే ఈ స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని హైడ్రా అధికారుల‌ను క‌మిష‌న‌ర్ ఆదేశించారు.

Next Story