- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Raghuram Rajan: అమెరికా ఫెడ్‌లో రఘురామ్ రాజన్‌కు కీలక బాధ్యతలు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన ద్రవ్య విధానాన్ని మరింత సమర్థవంతంగా మార్చేందుకు, అధిక ద్రవ్యోల్బణానికి కొత్త పరిష్కారాలు కనుగొనే లక్ష్యంతో ఐదు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన అత్యున్నత కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్‌లో భారతీయులకు కీలక పదవులు వరించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన ద్రవ్య విధానాన్ని మరింత సమర్థవంతంగా మార్చేందుకు, అలాగే ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణానికి కొత్త పరిష్కారాలు కనుగొనే లక్ష్యంతో ఐదు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. కొత్త ఫెడ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ ప్రకటించిన ఈ కమిటీల్లో మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, హార్వర్డ్ ఆర్థికవేత్త రాజ్ చెట్టి, మైక్రోసాఫ్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశా శర్మలకు కీలక బాధ్యతలు అప్పగించారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మాజీ గవర్నర్ మెర్విన్ కింగ్, నోబెల్ గ్రహీత థామస్ సార్జెంట్, వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్, వాల్‌మార్ట్ మాజీ సీఈఓ డగ్ మెక్‌మిలన్ వంటి ప్రముఖులు కూడా ఈ బృందాల్లో ఉన్నారు. 'ఫెడ్‌లో కొత్త ఆలోచనలకు అవకాశం కల్పించి, విధాన నిర్ణయాల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యం' అని వార్ష్ చెప్పారు.
రఘురామ్ రాజన్ హార్వర్డ్‌కు చెందిన కారెన్ డైనాన్, మాజీ ఫెడ్ గవర్నర్ జెరెమీ స్టెయిన్‌లతో కలిసి బ్యాలెన్స్ షీట్ పాలసీ టాస్క్ ఫోర్స్‌లో పనిచేస్తారు. మహమ్మారి సమయంలో దాదాపు 9 ట్రిలియన్ డాలర్లకు పెరిగిన ఫెడరల్ రిజర్వ్ బ్యాలెన్స్ షీట్‌ను ఎలా నిర్వహించాలి, దాన్ని తగ్గించే ప్రక్రియ వల్ల కలిగే లాభనష్టాలు ఏమిటి, ద్రవ్య విధానంపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే అంశాలను ఈ బృందం సమీక్షించనుంది. మరోవైపు రాజ్ చెట్టి ఆర్థిక డేటా నాణ్యత, విధాన నిర్ణయాలకు ఉపయోగించే సమాచార వ్యవస్థలను మెరుగుపరచే టాస్క్ ఫోర్స్‌లో పనిచేయనున్నారు. ఆశా శర్మ ఏఐతో పాటు కొత్త సాంకేతికతలు ఉత్పాదకత, ఉపాధి, ఆర్థిక వృద్ధిపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేసే బృందంలో సభ్యురాలిగా ఉంటారు. కాగా, 2013–16 మధ్య ఆర్‌బీఐ గవర్నర్‌గా, అంతకుముందు ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేసిన రాజన్ అనుభవం ఫెడ్ విధాన సమీక్షలో కీలకంగా మారే అవకాశముందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.






