- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు రెండో వందే భారత్ స్లీపర్ ‘సంత్ రవిదాస్ ఎక్స్‌ప్రెస్’ ప్రారంభం.. ట్రైన్ విశేషాలు ఇవే
దేశంలో రెండో వందే భారత్ స్లీపర్ రైలు సేవలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో రెండో వందే భారత్ స్లీపర్ రైలు సేవలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి - పంజాబ్‌లోని చేహర్టా (అమృత్‌సర్ సమీపం) మధ్య నడవనున్న ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జులై 17న (రేపు) జలంధర్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ సేవలకు ‘సంత్ రవిదాస్ ఎక్స్‌ప్రెస్’ (ట్రైన్ నెం. 14624/14623) అని పేరు పెట్టారు. ఇదే వేదిక నుంచి జలంధర్ కొత్త రైల్వే స్టేషన్‌ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.
వారానికి మూడు రోజులు ప్రయాణం
ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల మధ్య రాత్రి ప్రయాణాన్ని వేగవంతం, సౌకర్యవంతం చేసే ఈ స్లీపర్ రైలు వారానికి మూడు రోజులు అందుబాటులో ఉంటుంది. చేహర్టా టు వారణాసి (ట్రైన్ నెం. 14624): ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో మధ్యాహ్నం 2:05 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు వారణాసి చేరుకుంటుంది. వారణాసి టు చేహర్టా (ట్రైన్ నెం. 14623): ప్రతి గురు, శని, సోమవారాల్లో రాత్రి 7:05 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 5:10 గంటలకు చేహర్టా చేరుకుంటుంది.
ప్రధాన స్టాపింగ్‌లు
ఈ రైలు తన ప్రయాణంలో అమృత్‌సర్, జలంధర్ సిటీ, లుధియానా, అంబాలా కాంట్, సహారన్‌పూర్, మొరాదాబాద్, బరేలీ, షాజహాన్‌పూర్, లక్నో, సుల్తాన్‌పూర్, జౌన్‌పూర్ సిటీ స్టేషన్లలో ఆగుతుంది. ఇప్పటికే హౌరా-కామాఖ్య మార్గంలో దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ సేవలు విజయవంతంగా నడుస్తుండగా, తాజా రైలు ప్రారంభం భారతీయ రైల్వే ఆధునికీకరణలో మరో కీలక అడుగు కానుంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య ఆధ్యాత్మిక పర్యాటకాన్ని, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.






