Health : ఫుడ్ అలర్జీలు, ఇంటాలరెన్స్ ఎందుకు వస్తాయి? ఎలా నివారించాలి?

by Javid Pasha |

ఒకప్పుడు ఎంతో ఇష్టంగా తినే ఆహారాలు కొంత కాలానికి తినాలనిపించకపోవడం అనే సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు.

Health : ఫుడ్ అలర్జీలు, ఇంటాలరెన్స్ ఎందుకు వస్తాయి? ఎలా నివారించాలి?
X

దిశ, ఫీచర్స్ : స్కూల్ డేస్‌లో రోజూ రెండు గ్లాసుల పాలు తాగే అలవాటు గల నీలిమ, కాలేజ్ డేస్‌లో మాత్రం వాటిని అసహ్యించుకుంటోంది. గ్లాసు కాదు కదా.. ఒక్క చుక్క పాలుకూడా తాగనని చెబుతోంది. చిన్నప్పుడు గుత్తి వంకాయ అంటే ఎంతో ఇష్టంగా తినే అవినాశ్ కూడా అంతే.. పెద్దయ్యాక అసలు వంకాయ కూర అంటేనే అసహ్యించుకుంటున్నాడు. ఇది కేవలం ఒక నీలిమ, ఒక అవినాశ్ వంటి ఒకరిద్దరి సమస్య మాత్రమే కాదు. ఇటీవల చాలామందిలో ఇలాంటి ఆహార అసహనాలు(Food intolerance), అలర్జీలు పెరుగుతున్నాయి. కారణమేమిటి? అదేమైనా అనారోగ్య లక్షణమా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలసుకుందాం.

ఒకప్పుడు ఎంతో ఇష్టంగా తినే ఆహారాలు, తాగే పానీయాలు కూడా కొంత కాలానికి లేదా వయసు పెరిగేకొద్దీ తినాలనిపించకపోవడం అనే సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు రోజూ పాలు తాగేవారికి ఆకస్మికంగా మిడిల్ ఏజ్ రాగానే లాక్టోస్ ఇంటాలరెన్స్ వచ్చి కడుపు నొప్పి, బ్లోటింగ్, డయేరియా వంటి సమస్యలు తలెత్తుతున్నాయని, కొందరికి గ్లుటెన్, షెల్ఫిష్ (సీఫుడ్), నట్స్ వంటి ఆహారాలపై అలర్జీలు కూడా కొత్తగా వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఇలాంటప్పుడు ఆయా వ్యక్తులు తమ శరీర తత్వాన్ని బట్టి నడుచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

ఇలా ఎందుకు జరుగుతుంది?

వయసు పెరిగే కొద్దీ శరీరంలో లాక్టేస్ ఎంజైమ్ తగ్గడం, గట్ మైక్రోబయోమ్‌లో మార్పులు, ఇన్ఫెక్షన్లు, మందుల వాడకం, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ వంటి దశల్లో హార్మోనల్ మార్పులు, రోగనిరోధక వ్యవస్థలో మార్పులు వంటివి కారణాలు ఇందుకు కారణం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొవిడ్-19 తర్వాత కూడా చాలా మందికి కొత్త అసహనాలు వచ్చినట్లు వైద్య పరిశోధకులు చెబుతున్నారు. ఇక అలర్జీలు ఇమ్యూన్ సిస్టమ్‌కు సంబంధించినవి (IgE మీద ఆధారపడి, అనాఫిలాక్సిస్ వంటి తీవ్ర ప్రతిచర్యలు రావచ్చు) కాగా, ఇంటాలరెన్స్ అనేవి జీర్ణ సమస్యలకు దారితీస్తాయిని చెబుతున్నారు.

గట్ ఇన్ఫెక్షన్లు (రోటావైరస్, జియార్డియా), సెలియాక్ డిసీజ్, క్రాన్ డిసీజ్, ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వంటివి చిన్న ప్రేగు మ్యూకోసాను దెబ్బతీస్తాయి. ఇలాంటప్పుడు కూడా ఫుడ్ ఇంటాలరెన్స్ ఏర్పడవచ్చు. అలాగే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ తీసుకోవడం, యాంటీబయాటిక్స్, కొన్ని రకాల ఇతర మందులు వాడకం, చిన్న ప్రేగు సర్జరీ లేదా గాయాలు వంటివి కూడా కారణం అవుతుంటాయి. మరికొందరిలో వయసు పెరగడం‌తో సహజంగానే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గి ఈ సమస్యలు తలెత్తవచ్చు.

లక్షణాలు ఏమిటి?

లక్షణాలను బట్టి ఫుడ్ ఇంటాలరెన్స్ లేదా అలర్జీలను ఈజీగా గుర్తించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా అలర్జీల్లో చర్మంపై దద్దులు, వాపు, శ్వాసలో ఇబ్బంది వంటివి త్వరగా వస్తాయి. ఆహార అసహనం లేదా ఫుడ్ పాయిజనింగ్ వంటి వాటిలో కడుపు నొప్పి, బ్లోటింగ్, ఎసిడిటీ వంటివి ఆహారం తిన్న తర్వాత కొంతసేపటికి వస్తాయి. ఇలాంటప్పుడు వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. అవసరాన్ని బట్టి కొన్ని బ్లడ్ టెస్టులు (స్కిన్ ప్రిక్ టెస్ట్, బ్లడ్ టెస్టులు) చేయించుకోవాలని సూచిస్తున్నారు. సమతుల్య ఆహారం, గట్ హెల్త్‌ను జాగ్రత్తగా చూసుకోవడం వంటి చర్యల ద్వారా ఆహార అసహనాలను కొంతవరకు నియంత్రించవచ్చు. అయితే కొన్ని రకాల ఆహారాలు పూర్తిగా మానేస్తే పోషకాల లోపం కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఈ విషయంలో డాక్టర్ సలహా తప్పక తీసుకోవాలి.

పరిష్కారం ఏమిటి?

*ఏ ఆహారం తిన్న తర్వాత లక్షణాలు వస్తున్నాయో గమనించండి. ముఖ్యంగా కడుపు నొప్పి, బ్లోటింగ్, డయేరియా, గ్యాస్ వంటివి పెంచే ఆహారాలను నివారించడం లేదా డాక్టర్ సలహాతో తీసుకునే పద్ధతులు మార్చడం వంటివి చేయవచ్చు.

*డాక్టర్ లేదా డైటీషియన్ సలహాతో ఎలిమినేషన్ డైట్ చేయండి. మీకు అసహ్యం అనిపించే ఆహారాలను 2-6 వారాలు మానేసి, తర్వాత నెమ్మదిగా తిరిగి ప్రవేశపెట్టి చూడండి. అప్పుడు సాధారణం అనిపించే అవకాశం దాదాపు ఉంటుంది. అలా జరగకపోతే మీకు పడని ఆహారాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. సాధారణంగా

*పాలు తాగడం లేదా తినే విషయంలో ఇంటాలరెన్స్ ఉన్నవారు లాక్టోస్ ఎంజైమ్ టాబ్లెట్స్ తీసుకుంటే జీర్ణం సులభం అవుతుంది. గ్లుటెన్ ఫ్రీ ఆహారాలు అంటే.. రాగి, జొన్న, సజ్జలు మొదలగునవి ఎక్కువగా తినండి. అయినప్పటికీ లక్షణాలు తీవ్రంగా ఉంటే యాంటాసిడ్స్, యాంటీ-డయేరియల్ మందులు వంటివి డాక్టర్ల సలహాతో ఉపయోగించవచ్చు.

*ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం (కూరగాయలు, పండ్లు), ప్రోబయోటిక్స్ (కర్రెట్ యోగర్ట్, బటర్ మిల్క్) తీసుకోండి. అనవసరమైన యాంటీబయాటిక్స్ మానివేయండి. సమతుల్య ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర వల్ల గట్ మైక్రోబయోమ్ మెరుగుపడుతుంది. సెలియాక్ డిసీజ్ లాంటి సమస్యలు ఉంటే పూర్తి గ్లుటెన్-ఫ్రీ డైట్ అవసరం.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story