- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: ఇల్లు అద్దెకు ఇస్తున్నారా?.. ఇకపై ఆ రూల్స్ పాటించకపోతే ఆస్తులు సీజ్!
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక శక్తుల కదలికలకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక శక్తుల కదలికలకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇళ్ళను, గదులను అద్దెకు ఇచ్చే యజమానులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు ప్రవేశపెట్టిన ప్రత్యేక 'హాక్ ఐ' (Hawk Eye) యాప్ అద్దెదారుల వివరాలను నమోదు చేయడాన్ని తప్పనిసరి చేశారు. ఇంటి యజమానులు తమ ఇళ్లను లేదా గదులను ఎవరికైనా అద్దెకు ఇచ్చే ముందు తప్పనిసరిగా వారి వివరాలను 'హాక్ ఐ' యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అద్దెదారుల ఐడీ కార్డులు, వారి ఫోటోలతో పాటు ఇతర వివరాలను ఈ యాప్‌లో నమోదు చేసిన తర్వాతే పోలీసు వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాతే ఇళ్లను అద్దెకు ఇవ్వాల్సి ఉంటుంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
పోలీసుల ముందస్తు వెరిఫికేషన్ లేకుండా, ప్రైవేటుగా లేదా సొంత నిర్ణయాలతో ఇళ్లను అద్దెకు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, సదరు ఆస్తులను సీజ్ చేస్తామని, అవసరమైతే యజమానులకు జైలు శిక్ష కూడా పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికే గేటెడ్ కమ్యూనిటీలు, ఇతర నివాస ప్రాంతాల్లోని పలువురు యజమానులకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. నగరంలోని మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్ పరిధిలో పోలీసులు ఇటీవల పెద్ద ఎత్తున తనిఖీలు (రైడ్స్) నిర్వహించారు. ఈ సోదాల్లో అద్దె ఇళ్లల్లో ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాలు, గంజాయి బ్యాచ్‌లు, సోషల్ మీడియా వేదికగా 'వ్యభిచార గృహాలు నడుపుతున్న అసాంఘిక శక్తులు పట్టుబడ్డారు. అంతేకాకుండా కంప్యూటర్లు, ల్యాప్టాప్ ముందు కూర్చుని నిషేధిత యాప్సును ప్రమోట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు సైతం పట్టుబడ్డారు.
ఇలాంటి అసాంఘిక శక్తుల ఆటకట్టించడం కేవలం పోలీసుల వల్లే సాధ్యం కాదని భావించిన ఉన్నతాధికారులు.. స్థానిక ఇంటి యజమానుల భాగస్వామ్యంతోనే నేరాలకు చెక్ పెట్టవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ అద్దెదారుల వివరాలను 'హాక్ ఐ' యాప్లో నమోదు చేసి పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.






