హోం వర్క్ గా కల్మా రాయిస్తే క్లాస్ రూమ్‍లో ఇంకేమి బోధిస్తున్నారో? సక్సెస్ స్కూల్ ఘటనపై జనసేన సీరియస్

by Prasad Jukanti |

సైదాబాద్ సక్సెస్ స్కూల్‌లో 'కల్మా'ను హోంవర్క్‌గా ఇవ్వడంపై జనసేన మండిపడింది. ఈ ఘటనపై తక్షణ విచారణ జరపాలని డిమాండ్ చేసింది.

హోం వర్క్ గా  కల్మా రాయిస్తే  క్లాస్ రూమ్‍లో ఇంకేమి బోధిస్తున్నారో? సక్సెస్ స్కూల్ ఘటనపై జనసేన సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ సైదాబాద్ సక్సెస్ స్కూల్‍లో (Saidabad Success School) హిందూ విద్యార్థికి కల్మా చదవాలంటూ హోంవర్క్‌గా ఇచ్చిన వ్యవహారంపై జనసేన పార్టీ (Janasena Party) తీవ్రంగా స్పందించింది. సక్సెస్ స్కూల్ లో విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక మతానికి సంబంధించిన అంశాన్ని హోంవర్క్ గా ఇవ్వడం తీవ్ర ఆపక్షేపణీయం అని, విద్యార్థుల స్కూల్ డైరీలో బహిరంగంగా మతపరమైన అంశాన్ని హోంవర్క్‌గా రాస్తే, తరగతి గదిలో ఇంకేమి బోధిస్తున్నారో? అని అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.

గతంలో ఇలాగే జరిగిందా?:

మదర్సా అయితే మదర్సా అని చెబుతారు, మిషనరీ స్కూల్ అయితే తన ప్రత్యేకతను చెబుతుంది, వేద పాఠశాల అయితే వేదాలు బోధిస్తామని ముందుగానే తెలియజేస్తుంది. తల్లిదండ్రులు కూడా అదే అవగాహనతోనే పిల్లలను అక్కడ చేర్పిస్తారు. మరి 'సక్సెస్ స్కూల్' అని పేరుపెట్టుకుని ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం..? అని జనసేన ప్రశ్నించింది. రాష్ట్ర గుర్తింపు పొందిన సాధారణ విద్యాసంస్థల్లో అన్ని మతాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటారని, అలాంటి పాఠశాలల్లో రాజ్యాంగ విలువలు, నైతిక విద్య, విజ్ఞానం బోధించాలి తప్ప, ప్రత్యేకంగా ఒక్క మతాన్ని ప్రోత్సహించకూడదని జనసేన హితవు పలికింది. గతంలో కూడా ఇలాంటి బోధన, హోంవర్క్ ఇచ్చారా? అనే అంశాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరింది.

మత ప్రచార కేంద్రాలు కాకూడదు:

జనసేన ఏ మతానికి వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ.. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని ఆచరించే హక్కును ఇచ్చిందని గుర్తుచేసింది. విద్యాసంస్థలు రాజ్యాంగ స్ఫూర్తితో విద్యార్థులందరినీ సమానంగా చూడాలని పేర్కొంది. పాఠశాలలు మత ప్రచార వేదికలుగా కాకుండా.. జాతీయత, రాజ్యాంగ స్ఫూర్తి, విజ్ఞానం, నైతిక విలువలను పెంపొందించే విద్యాలయాలుగా ఉండాలని, పిల్లలపై విద్య పేరుతో ఏ మతాన్ని రుద్దే ప్రయత్నాలను అనుమతించరాదని స్పష్టం చేసింది. పాఠశాలలు జాతీయతను నిర్మించే ఆలయాలు కావాలి తప్ప, మత ప్రచార కేంద్రాలు కాకూడదని జనసేన పార్టీ తేల్చి చెప్పింది.

Next Story