కెన్-బేత్వా ప్రాజెక్టుపై భగ్గుమన్న ఆదివాసీలు.. మెడకు ఉరితాళ్లతో జల సత్యాగ్రహం

by Ramesh Naini |

మధ్యప్రదేశ్‌లోని చతర్‌పూర్, పన్నా జిల్లాల్లో కెన్-బేత్వా నది అనుసంధాన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసీలు మళ్లీ ఆందోళన బాట పట్టారు.

కెన్-బేత్వా ప్రాజెక్టుపై భగ్గుమన్న ఆదివాసీలు.. మెడకు ఉరితాళ్లతో జల సత్యాగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని చతర్‌పూర్, పన్నా జిల్లాల్లో కెన్-బేత్వా నది అనుసంధాన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసీలు మళ్లీ ఆందోళన బాట పట్టారు. పారదర్శక పునరావాసం, మెరుగైన పరిహారం కల్పించాలని డిమాండ్ చేస్తూ గోండ్, కోల్ సామాజిక వర్గాలకు చెందిన మహిళలు, రైతులు కుపి గ్రామం సమీపంలోని బరానా నది ఒడ్డున మెడకు ఉరితాళ్లు వేసుకుని వినూత్న నిరసన చేపట్టారు. అధికారులతో గతంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో, నదిలో పడుకుని ‘న్యాయ్ దో యా మార్ దో’ (న్యాయం చేయండి లేదా చంపేయండి) అంటూ నినాదాలు చేస్తూ జల సత్యాగ్రహం, చితా ఆందోళనలు చేస్తున్నారు.

ప్రధాన డిమాండ్లు, ఆందోళనలు

ఈ ప్రాజెక్టు వల్ల పన్నా టైగర్ రిజర్వ్ పరిధిలోని వేలాది హెక్టార్ల అటవీ ప్రాంతంతో పాటు 22 గ్రామాలు ముంపునకు గురవుతాయని, సుమారు 7 వేల కుటుంబాలు నిరాశ్రయులవుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రకటించిన పునరావాస ప్యాకేజీని రూ.12.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచాలని, భూమి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు.

అధికారుల వాదన ఇది..

ఆందోళనకారులంతా పన్నా జిల్లాకు చెందినవారని, వీరు కెన్-బేత్వా ప్రాజెక్టుకు కాకుండా మజ్‌గావ్, రుంజ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితులని చతర్‌పూర్ కలెక్టర్ పార్థ్ జైస్వాల్ తెలిపారు. ఆ రెండు ప్రాజెక్టుల నిర్వాసితుల పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.12.5 లక్షలకు పెంచుతూ ఇటీవల రాష్ట్ర కేబినెట్ రూ.300 కోట్ల ప్యాకేజీని ఆమోదించిందని స్పష్టం చేశారు. కొందరు స్థానిక కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే కెన్-బేత్వా సైట్‌ను వాడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

పర్యావరణవేత్తల ఆందోళన

బుందేల్‌ఖండ్ ప్రాంతానికి సాగు, తాగునీరు, విద్యుత్‌ను అందించే లక్ష్యంతో జాతీయ నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా 2024 డిసెంబర్ 25న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే, దీనివల్ల పన్నా జాతీయ పార్కులోని పర్యావరణం, వన్యప్రాణుల మనుగడ దెబ్బతింటుందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సహా పలువురు పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story