- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీళ్లు పుష్కలం.. కాలువ అధ్వానం.. చిన్న వరదకే ఐదు చోట్ల గండి!
వృధాగా పోయే వాగు నీటిని గొలుసుకట్టు చెరువులకు మళ్లించాలన్న రైతుల సంకల్పం మూణ్నాళ్ల ముచ్చటైంది.

దిశ, ఎల్కతుర్తి: వృధాగా పోయే వాగు నీటిని గొలుసుకట్టు చెరువులకు మళ్లించాలన్న రైతుల సంకల్పం మూణ్నాళ్ల ముచ్చటైంది. బీఆర్ఎస్ హయాంలో కోట్లు వెచ్చించి నిర్మించిన మాటు కాల్వ (ఫీడర్ ఛానెల్) ఒక్క భారీ వర్షానికే ఐదారు చోట్ల గండ్లు పడి, పూడికతో నిండిపోయింది. శాశ్వత నీటి కరువును తీరుస్తుందని భావించిన ఈ కాల్వ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఎందుకు పనికిరాకుండా పోయింది. కాల్వను పునరుద్ధరిస్తే ఆరు చెరువుల కింద దాదాపు రెండు వేల ఎకరాల ఆయకట్టు రైతులకు లబ్ధి కలిగే అవకాశం ఉంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం, హసన్‌పర్తి మండలం అన్నసాగర్ గ్రామాల సరిహద్దులో పెద్దవాగు ప్రవహిస్తున్నది. ధర్మసాగర్ రిజర్వాయర్ మత్తడి నీరు, ఇనుపరాతి గుట్టల్లోని జాలు నుండి వచ్చే నీరు, పలు గొలుసుకట్టు చెరువుల మత్తడి నీళ్లు పెద్ద వాగు గుండా ప్రవహించి, కమలాపూర్ మండలం శనిగరం వాగులో, అటు నుండి మానేరు వాగులో కలుస్తాయి. ఏడాదిలో దాదాపు ఐదు నెలల పాటు ఈ వాగు ప్రవాహం కొనసాగుతుంది.
వాగుపై చెక్ డ్యాం..
వృథా నీటికి అడ్డుకట్ట కట్టి గొలుసుకట్టు చెరువులకు మళ్లించేందుకు(1985)లో అప్పటి ఇంజినీర్లు అన్నసాగర్, ఎల్కతుర్తి శివారులో వాగుకు అడ్డుగా చెక్ డ్యాం(మాటు) నిర్మించి ఎల్కతుర్తి వైపు షటర్లు బిగించారు. అక్కడి నుంచి కాలువ ద్వారా బోడికోని కుంట, మల్లన్నకుంటను కలుపుతూ ఎల్కతుర్తి ఊర చెరువు వరకు తవ్వారు. కానీ, గతంలో కురిసిన భారీ వర్షాలకు కాలువ తెగిపోయింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయలో భాగంగా కాలువ పునరుద్ధరణకు నిధులు కేటాయించింది.
కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం..
చెక్ డ్యాం నుంచి ఎల్కతుర్తి ఊర చెరువు వరకు 2.4 కిలోమీటర్ల మేర కాలువ, మధ్యలో మూడు బ్రిడ్జిలు, రెండు చోట్ల షర్టర్లతో పాటు ఎల్కతుర్తి చెరువులో పూడికతీత, మత్తడి, తూము, బతుకమ్మ విగ్రహం, బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేయడానికి రెండున్నర కోట్లు విడుదలయ్యాయి. బీఆర్ఎస్ నేత బినామీ అయిన ఓ కాంట్రాక్టర్ ఈ పనులను చేపట్టాడు. మాటు నుండి ఉన్న కాల్వకు రెండు వైపులా కట్ట పోయాల్సి ఉన్నా, ఒకవైపు మట్టి పోసి, మరోవైపు వదిలేశాడు. వర్షాలు కురిసిన సమయంలో వచ్చిన వరద నీరు ఈ కాల్వలోకి చేరి ఎక్కడికక్కడ కట్ట తెగిపోయింది. కాలువ నిండా మట్టి నిండిపోయింది. కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేయడంతో కాల్వ ఎందుకు పనికిరాకుండా పోయింది. కాల్వలో తుమ్మ, తుంగ మొలిచి నీళ్లు వెళ్లలేని పరిస్థితి వచ్చింది.
చందాలు వేసుకొని..
గతేడాది వాగు నీటిని ఎల్కతుర్తి, చింతలపల్లి రైతులు పొలాలకు మళ్లించుకునేందుకు తలా కొంత చందాలు వేసుకున్నారు. వీరికి ఎల్కతుర్తి ముదిరాజ్ లు తోడై సంఘం నుండి కొన్ని డబ్బులు వెచ్చించి జేసీబీ సాయంతో తాత్కాలిక మరమ్మతులు చేసి చెరువులు నింపారు. కాల్వకు మోటార్లు వేసి రైతులు పంటలు పండించుకున్నారు. కానీ, ప్రస్తుతం కాలువ నిరుపయోగంగా మారి చెత్తా, చెదారంతో నిండింది.
రెండు వేల ఎకరాలకు నీరు..
పెద్ద వాగు గుండా మానేరులో కలిసే నీటిని చెక్ డ్యాం ద్వారా మళ్లిస్తే ఎల్కతుర్తి, సూరారం, దండేపల్లి గ్రామాలలో ఆరు గొలుసుకట్టు చెరువులు నిండే అవకాశం ఉంది. అలాగే ఎల్కతుర్తి, చింతలపల్లి విలేజ్ లలో నీటి కరువు తీరుతుంది. ఆయా విలేజ్ లలో భూగర్భ జలాలకు కొదువ ఉండదు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి కాల్వను పునరుద్ధరించాలని, సీసీతో లైనింగ్ వేయించాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.






