వెల్దుర్తి నుంచి ఉక్కు ఉత్పత్తులు.. జానకంపేట్ నుంచి మొక్కజొన్న రవాణాకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం

by Jakkula.Mamatha |

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ డివిజన్ సరుకు రవాణా రంగాన్ని మరింత విస్తరించే దిశగా కీలక ముందడుగు వేసింది.

వెల్దుర్తి నుంచి ఉక్కు ఉత్పత్తులు.. జానకంపేట్ నుంచి మొక్కజొన్న రవాణాకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం
X

దిశ, సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ డివిజన్ సరుకు రవాణా రంగాన్ని మరింత విస్తరించే దిశగా కీలక ముందడుగు వేసింది. పరిశ్రమలు, రైతులకు ప్రయోజనం చేకూర్చేలా వెల్దుర్తి, జానకంపేట్ రైల్వే స్టేషన్ల నుంచి తొలిసారిగా కొత్త సరుకు రవాణా సేవలను ప్రారంభించింది. వెల్దుర్తి రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక కంటైనర్ టెర్మినల్‌ను ఏర్పాటు చేసి, సమీప పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న పిగ్ ఐరన్, టీఎంటీ స్టీల్ బార్లతో తొలి కంటైనర్ రేక్‌ను లోడ్ చేశారు. ఈ సరుకును ఢిల్లీ, పంజాబ్, ముంబై, గుజరాత్ వంటి ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలకు తరలించనున్నారు. ఈ ప్రత్యేక టెర్మినల్ ద్వారా ఉక్కు, ఇనుము ఉత్పత్తుల రవాణా మరింత వేగవంతంగా, విశ్వసనీయంగా, తక్కువ వ్యయంతో సాగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు పరిశ్రమలు తమ ఉత్పత్తులను సులభంగా చేరవేసే అవకాశాన్ని ఇది కల్పించనుంది. అదే విధంగా, జానకంపేట్ రైల్వే స్టేషన్‌లో 21 కవర్డ్ వ్యాగన్లతో కూడిన తొలి మినీ రేక్‌లో మొక్కజొన్నను లోడ్ చేసి మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌కు పంపించారు.

ఈ సేవల ద్వారా తెలంగాణ రైతులు పండించే మొక్కజొన్నను తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, వేగంగా మార్కెట్లకు చేరవేయగలుగుతారు. రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు లభించడంతో పాటు, మరాఠ్వాడా ప్రాంతంలో ఆహార ధాన్యాల అవసరాలను తీర్చడంలో కూడా ఈ రవాణా సేవలు కీలకంగా మారనున్నాయి. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, జోన్ పునర్వ్యవస్థీకరణ అనంతరం కూడా కొత్త ట్రాఫిక్‌ను ఆకర్షిస్తూ సరుకు రవాణా లోడింగ్‌ను మరింత పెంచే దిశగా అధికారులు కృషి కొనసాగించాలని సూచించారు. హైదరాబాద్ డివిజన్ చేపట్టిన ఈ కొత్త కార్యక్రమాలు పరిశ్రమలు, రైతులు, వ్యాపార వర్గాలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణా ఆదాయాన్ని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషించనున్నాయి.

Next Story