- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం మెరిపిస్తామని మోసం.. 8 గ్రాముల బంగారం కాజేసిన కేటుగాళ్లు!
బంగారు ఆభరణాలు కొత్తవాటిలా మెరిపిస్తామని నమ్మబలికి మహిళలను మోసం చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

దిశ,తొగుట: బంగారు ఆభరణాలు కొత్తవాటిలా మెరిపిస్తామని నమ్మబలికి మహిళలను మోసం చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మండలంలోని వెంకట్రావు పేట గ్రామంలో శనివారం ఇద్దరు యువకులు ఈ తరహా మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని పలువురు ఇళ్లకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు తమ వద్ద ఉన్న ప్రత్యేక పౌడర్, లిక్విడ్‌తో బంగారం, వెండి ఆభరణాలను తెల్లగా చేసి మెరిపిస్తామని చెప్పారు. చాలా మంది వారి మాటలను నమ్మలేదు. చివరికి గ్రామానికి చెందిన కళ్లెపు అనూష ఇంటికి వెళ్లిన వారు ముందుగా ఆమె చేతుల పై పౌడర్ వేసి నమ్మకం కల్పించారు. ఆ తర్వాత అనూష మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, ఆమెతో పాటు ఆమె చెల్లి కాళ్లలో ఉన్న వెండి పట్ట గొలుసులు తీసుకొని శుభ్రం చేస్తామని చెప్పారు.
ఏదో రసాయన ద్రావణంలో వాటిని ముంచి కొంతసేపటి తర్వాత తిరిగి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆభరణాల బరువు తక్కువగా ఉన్నట్లు గమనించిన బాధితులు స్థానిక బంగారు దుకాణంలో తూకం వేయించగా సుమారు 8 గ్రాముల బంగారం కరిగించి కాజేసినట్టు గుర్తించారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న వారు కన్నీరుమున్నీరయ్యారు. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇలాంటి మోసాలు, దొంగతనాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపరిచితులు ఇంటికి వచ్చి ఆభరణాలు మెరిపిస్తామని, శుభ్రం చేస్తామని చెప్పినా ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.ఘటనపై సమాచారం అందుకున్న తొగుట పోలీసులు విచారణ చేపట్టి నిందితుల కోసం గాలిస్తున్నారు. మహిళలు అప్రమత్తంగా ఉండి విలువైన ఆభరణాలను అపరిచితుల చేతికి ఇవ్వవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.






