- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రుణం కట్టినా బంగారం బందీ..! ఇదేం కీర్తన గోల్డ్ లోన్ కొత్త నిబంధన..?
పాల్వంచలోని కీర్తన గోల్డ్ లోన్ శాఖ తీరుపై నవభారత్ గాంధీనగర్‌కు చెందిన దేవెల్లి సాయికుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, పాల్వంచ టౌన్: పాల్వంచలోని కీర్తన గోల్డ్ లోన్ శాఖ తీరుపై నవభారత్ గాంధీనగర్‌కు చెందిన దేవెల్లి సాయికుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం 5 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.51 వేల రుణం పొందిన సాయికుమార్, మూడు రోజుల క్రితం సంబంధిత రుణానికి సంబంధించిన మొత్తం బకాయిని చెల్లించారు. అయితే రుణం పూర్తిగా క్లియర్ అయినప్పటికీ ఇప్పటివరకు బంగారాన్ని విడుదల చేయలేదని ఆరోపిస్తున్నారు. దీనిపై శాఖ సిబ్బందిని ప్రశ్నించగా, మీ పేరిట మరో రుణ ఖాతాలో బకాయి ఉందని, అది కూడా చెల్లిస్తేనే ఈ బంగారాన్ని విడుదల చేస్తామని చెప్పినట్లు తెలిపారు. ఒక రుణానికి సంబంధించిన మొత్తం బకాయి చెల్లించిన తర్వాత కూడా ఆ రుణంపై తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇవ్వకుండా నిలిపివేయడం ఏ నిబంధనల ప్రకారమని బాధితుడు ప్రశ్నిస్తున్నారు.
బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్..
డబ్బులు వసూలు చేసే విషయంలో కఠినంగా వ్యవహరించే సంస్థలు, వినియోగదారుడు రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఖాతా బకాయిని సాకుగా చూపి మరో ఖాతాకు సంబంధించిన బంగారాన్ని నిలిపివేయడం న్యాయసమ్మతమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని, కీర్తన గోల్డ్ లోన్ పాల్వంచ శాఖ తీరుపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






