మిలీనియల్స్‌ను వెంటాడుతున్న బర్న్ అవుట్.. జెన్‌జీలే బెటరా?

by Javid Pasha |

దాదాపు 50% మంది మిలీనియల్స్ బర్న్ అవుట్ కారణంగానే ఉద్యోగాలు వదిలేస్తున్నారు.

మిలీనియల్స్‌ను వెంటాడుతున్న బర్న్ అవుట్.. జెన్‌జీలే బెటరా?
X

దిశ, ఫీచర్స్ : కష్టాలు అందరికీ ఉంటాయి. బాధలు అందరూ మోస్తుంటారు. సమస్యలూ సవాళ్లూ ప్రతీ ఒక్కరికి ఎదురవుతుంటాయి. అంతేగానీ ఇవి ఏజ్‌ను బట్టో, వ్యక్తులను బట్టో ఉంటాయనుకుంటే మాత్రం పొరపాటే! కాకపోతే వయసును బట్టి కాస్త భిన్నంగా, భిన్నమైన సమస్యలు ఉండవచ్చు. వాటి ప్రభావంలో తేడాలు ఉండవచ్చు. జెన్‌జీలు(13-28 సంవత్సరాలు), మిలీనియల్స్ (29-44 సంవత్సరాలు) విషయంలోనూ ఇదే జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ రోజువారీ జీవితంలో, ఉద్యోగాల్లో ఈ రెండు తరాలను పోల్చి చూసిప్పుడు జెన్‌జీలకంటే మిలీనియల్స్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని, వీరు తరచుగా బర్న్ అవుట్ బాధితులుగా మారుతున్నారని ఒక టెక్ కంపెనీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

ఏమిటీ బర్నవుట్..!

బర్న్‌ అవుట్ అనేది దీర్ఘకాలిక ఒత్తిడివల్ల కలిగే మానసిక, శారీరక, భావోద్వేగ అలసటగా నిపుణులు చెబుతున్నారు. ఇది ఉద్యోగం లేదా బాధ్యతలపట్ల ఆసక్తి కోల్పోవడానికి దారితీస్తుందని, అసంతృప్తికి, నిస్సహాయతకు కారణం అవుతుందని పేర్కొంటున్నారు. అధిక పని ఒత్తిడి, వర్క్- లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, నిరంతర మానసిక ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల కూడా ఇది సంభవిస్తుంది. అయితే దీనిని మేనేజ్ చేయలేక మిలీనియల్ బర్న్‌ అవుట్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు డెలాయిట్ నిర్వహించిన గత సర్వేలు చెబుతున్నాయి.

50% మందిపై ప్రభావం

దాదాపు 50% మంది మిలీనియల్స్ బర్న్ అవుట్ కారణంగానే ఇటీవల ఉద్యోగాలు వదిలేస్తున్నారని డెలాయిట్ సర్వే పేర్కొన్నది. అంతేకాకుండా 84% మంది తాము చేస్తున్న ప్రస్తుత ఉద్యోగంలో అలసటను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా వీరు ఇతర తరాల కంటే ఎక్కువ గంటలు పని చేస్తూ, కష్టతరమైన బాధ్యతలను నిర్వహిస్తూ అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కెరీర్‌లో ఉన్నత స్థానాలను చేరుకోవడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. కానీ ఈ అతి శ్రమ(Excessive labor) మానసికంగా, శారీరకంగా అలసిపోయేలా చేస్తున్నదని సర్వే పేర్కొన్నది. జెన్ జీలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నారు.

కనిపించని ఆరాటం

ఓ వైపు మిలీనయిల్స్ బర్న్ అవుట్ బాధితులుగా మారుతుంటే, మరోవైపు జెన్ Z (1997-2012 మధ్య జన్మించినవారు) మాత్రం, అందుకు భిన్నమైన మానసిక ధోరణితో ఉంటున్నదని సర్వేలు చెబుతున్నాయి. మిలీనియల్స్ కంటే వీరు అనేక విషయాల్లో సంతోషంగా ఉంటున్నారు. వారితో పోల్చితే ఉద్యోగాలు, జీవితం గురించి భిన్నమైన ఆలోచనలను కలిగి ఉంటున్నారు. కేవలం 6% జెన్‌జీలు మాత్రమే కెరీర్‌లో లీడర్‌షిప్ స్థాయికి చేరుకోవడం తమ తమ ప్రధాన లక్ష్యమని చెబుతుండగా.., మిగతా శాతమంతా కెరీర్‌లో ఉన్నతస్థాయి కోసం ఆరాపడేకంటే(career superiors)జీవితంలో సమతుల్యతకే ప్రయారిటీ ఇస్తున్నారు.

మిలీనియల్స్ కంటే కూడా ఇటీవల జెన్‌జీలు వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. బర్న్ అవుట్‌కు గురయ్యే పరిస్థితి ఉన్నప్పుడు.. ఎంత మంచి ఉద్యోగాలైనా సరే వదిలేస్తున్నారు. అధిక ఒత్తిడిని అనుభవిస్తూ, ఇబ్బంది పడుతూ ఉద్యోగాలు చేసేందుకు వీరు ఎక్కువగా సిద్ధ పడట్లేదు. మిలీనియల్స్ & జెన్‌జీల మధ్య ఈ రెండు తేడాలే వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే జెన్‌జీలు మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సంతోషాన్ని కాపాడుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతూ, ఒత్తిడిని నివారించేందుకు మరింత స్మార్ట్ విధానాలను అనుసరిస్తుండగా.. మిలీనియల్స్ కాస్త మేనేజ్‌మెంట్ ఫ్రెండ్లీగా ఉంటూ.. ఒత్తిడిని సైతం భరిస్తున్నారు.

Next Story