- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ పూర్తి.. కోచింగ్ చదువు.. కానీ దోపిడీకి స్కెచ్ వేసిన టీనేజ్ యువతులు!
బీహార్ రాజధాని పాట్నాలో ఇద్దరు టీనేజ్ యువతులు చేసిన దోపిడీ యత్నం స్థానికంగా కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బీహార్ రాజధాని పాట్నాలో ఇద్దరు టీనేజ్ యువతులు చేసిన దోపిడీ యత్నం స్థానికంగా కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో ఓ నగల దుకాణంలోకి ప్రవేశించిన ఇద్దరు అమ్మాయిలు.. యజమాని ముఖంపై మత్తుమందు (పెప్పర్ స్ప్రే) కొట్టి దొంగతనానికి ప్రయత్నించారు. అయితే, యజమాని చాకచక్యంగా వ్యవహరించడంతో వారి ప్లాన్ బెడిసికొట్టి అడ్డంగా బుక్కయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పాట్నాలోని దిఘా ప్రాంతంలో ఉన్న ‘మా వైష్ణో జ్యువెలర్స్’కు శుక్రవారం ఇద్దరు యువతులు వచ్చారు. కమ్మలు, ఉంగరాలు కావాలంటూ యజమాని రాజేష్ కుమార్‌ను మాటల్లో పెట్టారు. ఆయన నగలు చూపిస్తున్న సమయంలో అదును చూసి.. ఒక యువతి ఆయన ముఖంపై మత్తు కలిగించే స్ప్రే చల్లింది. దీంతో యజమానితో పాటు అక్కడే ఉన్న మరో మహిళా కస్టమర్ ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
యజమాని సమయస్ఫూర్తి..
కళ్లు మండుతున్నప్పటికీ అప్రమత్తమైన రాజేష్ కుమార్.. వెంటనే నగల బాక్సులను భద్రపరిచి, బయటకు పరుగులు తీసి షాపు షట్టర్ కిందికి లాగేశారు. ఆయన కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ హడావుడిలో ఒక యువతి తప్పించుకోగా, మరొకరు షాపులోనే పట్టుబడింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న దిఘా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ యువతి ఇచ్చిన సమాచారంతో.. అర్ధరాత్రి దాడులు చేసి పరారీలో ఉన్న రెండో యువతిని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది.
టీనేజర్ల వెనుక ముఠా హస్తం ఉందా?
నిందితురాళ్లు ఇద్దరూ ఇంటర్ పూర్తి చేసి ఒకే కోచింగ్ సెంటర్‌లో చదువుకుంటున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ దోపిడీకి ప్లాన్ చేశామని వారు పోలీసులకు చెప్పారు. కాగా, వీరిలో ఒక యువతి తండ్రికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు సమాచారం. ఈ టీనేజర్ల వెనుక ఏదైనా ముఠా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.






