- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వాహన్ సారథి’ సాఫ్ట్‌వేర్ డౌన్.. తెలంగాణలో స్తంభించిన రవాణా సేవలు
తెలంగాణలో నిలిచిపోయిన ‘వాహన్ సారథి’ సాఫ్ట్ వేర్ సర్వర్లు.. ఆర్టీఓ ఆఫీసుల్లో నిలిచిన రవాణా సేవలు. గంటలో పునరుద్ధరిస్తామన్న అధికారులు!

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణవ్యాప్తంగా రవాణా శాఖ (RTO) కార్యాలయాల్లో సేవలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ‘వాహన్ సారథి’ సాఫ్ట్‌వేర్ సర్వర్లు పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తుంది. దీంతో డ్రైవింగ్ లైసెన్సులు, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, బదిలీలు వంటి రవాణా శాఖకు సంబంధించిన కీలక ఆన్‌లైన్ సేవలన్నీ పూర్తిగా ఆగిపోయాయి. పోర్టల్ సర్వర్ డౌన్ కావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు (RTO Offices) పనుల నిమిత్తం వచ్చిన వందలాది మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సర్వర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియక, పనులు కాక కార్యాలయాల వద్ద భారీగా క్యూలైన్లలో వేచి ఉండి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంకేతిక సమస్యపై స్పందించిన రవాణా శాఖ ఉన్నతాధికారులు.. కేంద్ర సర్వర్లలో తలెత్తిన లోపం వల్లే ఈ అంతరాయం కలిగిందని, పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. మరికొద్దిసేపట్లో సాఫ్ట్‌వేర్ సమస్య పూర్తిగా పరిష్కారమై రవాణా సేవలు యథావిధిగా అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.






